Sakshi News home page

కమల విలాపానికి కారణాలివీ

Published Mon, Nov 9 2015 2:46 AM

కమల విలాపానికి కారణాలివీ - Sakshi

న్యూఢిల్లీ/పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కుమార్ సారథ్యంలోని మహాకూటమి చేతుల్లో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ కూటమి మట్టికరిచింది. బిహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ పరాజయానికి గల పది కారణాలివీ...
 
 నితీశ్ ప్రజాదరణ
 మహాకూటమి గెలుపులో అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషించిన అంశం నితీశ్‌కు బిహార్‌లో గల ప్రజాదరణ. ఆయన దాదాపు అన్ని సర్వేల్లోనూ దేశంలో అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రిగా అగ్రభాగాన ఉన్నారు. ఎన్నికల్లో గెలవటానికి ప్రభుత్వ వ్యతిరేకత అన్న అంశం ఒక్కటే ఎన్నడూ సరిపోదు. అదీగాక దేశవ్యాప్తంగా బాగా పనిచేస్తున్న సీఎంకు ఓటర్లు బాసటగా నిలుస్తున్నారు. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు, శివరాజ్‌సింగ్‌చౌహాన్ మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నపుడు, రమణ్‌సింగ్ ఛత్తీస్‌గఢ్ సీఎంగా ఉన్నపుడు, నవీన్‌పట్నాయక్ ఒడిశా సీఎంగా ఉన్నపుడు.. తమ వ్యక్తిగత ప్రజాదరణ ప్రాతిపదికనే ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. బిహార్‌లో నితీశ్ మూడోసారి గెలిచారు.
 
 ముస్లింల అవిశ్వాసం!
 ముస్లింలకు, బీజేపీకి మధ్య ఎల్లప్పుడూ ఒక విశ్వాస లోటు ఉంది. బిహార్‌లో 15 శాతం మంది ముస్లింలున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్ల విభజన బీజేపీకి భారీగా కలసి వచ్చింది. ఇప్పుడు లాలూ, నితీశ్‌లు ఏకం కావటంతో ముస్లిం ఓట్లు సమీకృతమయ్యాయి. అది అసెంబ్లీ ఎన్నికల్లో వారి బలాన్ని రెట్టింపు చేసింది. దాద్రీలో వ్యక్తిని కొట్టి చంపటం, బీఫ్‌పై వివాదాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలు ఓటు వేసేలా ప్రేరేపించి ఉండొచ్చు.

 రాష్ట్రం వర్సెస్ లోక్‌సభ
  భిన్న రకాల ఎన్నికల మధ్య భేదాన్ని చూపటం ఓటర్లలో పెరుగుతోంది. ఏ సభకు ఎవరు అనే సూత్రం ప్రాతిపదికన వారు తమ ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. ఇది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో అక్కడున్న 7 ఎంపీ సీట్లలోనూ గెలుపొందిన బీజేపీ.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా మట్టికరిచింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో మూడు స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. ఢిల్లీ ప్రజలు మోదీని ప్రధానిగాను.. కేజ్రీవాల్‌ను సీఎంగాను కోరుకున్నట్లు స్పష్టమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి సలహాదారుగా వ్యవహరించి, బిహార్ ఎన్నికల్లో నితీశ్ వైపు చేరిన ప్రశాంత్‌కుమార్ సారథ్యంలోని నితీశ్ సమాచార బృందం.. ఢిల్లీ ఎన్నికల సూత్రాన్ని అనుసరిస్తూ.. పీఎం - సీఎం ద్వంద్వత్వాన్ని చక్కగా వినియోగించుకుంది. ‘‘బిహారీ వర్సెస్ బాహరీ’’ (బిహార్ నేతకు - బయటి నేతకు మధ్య) పోటీని అద్భుతంగా ముందుకు తెచ్చింది.

 కాంగ్రెస్ శుష్కించటం
 దేశంలో కాంగ్రెస్ పార్టీ శుష్కించిపోవటం కొనసాగుతోంది. అయితే.. కాంగ్రెస్‌కు వాటిల్లుతున్న నష్టం బీజేపీకి లాభంగా మారటం లేదు. నిజానికి.. ఢిల్లీలో కాంగ్రెస్ అసంతృప్త ఓటర్లు ఆప్‌ను ఎంచుకోవటంతో బీజేపీ భారీ మూల్యం చెల్లించింది. కాంగ్రెస్ లేని ఎలాంటి ద్విముఖ పోరాటమైనా.. ప్రత్యేకించి బిహార్ తరహాలో ఓటర్లలో ముస్లింలు గణనీయమైన భాగంగా ఉన్నట్లయితే.. బీజేపీకి మరింత కష్టంగా మారుతుంది. బిహార్‌లో తాము ఓడిపోయే పోరాటం చేస్తున్నామని తెలిసిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో బీజేపీకి సులభమైన పరిస్థితి ఉండకూడదని జాగ్రత్తలు తీసుకుంది. జేడీయూ, ఆర్‌జేడీలను ఏకం చేయటంలో.. నితీశ్ కుమార్‌ను సీఎం అభ్యర్థిగా లాలూను అంగీకరింపచేయటంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది. ఇలా.. బీజేపీకి పరిస్థితి అనుకూలించకుండా ఉండేలా ఈ పురాతన పార్టీ చర్యలు చేపట్టింది.

 ఓటర్లతో నితీశ్ సన్నిహిత బంధం
 అరవింద్ కేజ్రీవాల్ బిహార్‌లో మహాకూటమి తరఫున ప్రచారం చేయనప్పటికీ.. ఆయన నితీశ్ కుమార్‌కు కొన్ని కిటుకులు అందించినట్లు కనిపిస్తోంది. కేజ్రీవాల్ ఢిల్లీ డైలాగ్(చర్చ) తరహాలో.. నితీశ్ ‘హర్ ఘర్ దస్తక్’ (తలుపు తట్టటం) ప్రచారం నిర్వహించారు. ఇది ఆయనకు ఓటర్లతో వ్యక్తిగత సంబంధాలు సృష్టించుకోవటానికి దోహదం చేసింది. ఏవో కొన్ని భారీ సభల్లో ప్రసంగించటానికి బదులుగా.. చిన్న చిన్న, వ్యక్తిగత సమూహాల ద్వారా ఎక్కువ మంది జనంతో మాట్లాడటాన్ని ఎంచుకున్నారు. ఈ ఎత్తుగడ.. ఓటర్లు తమ నేతను సన్నిహితంగా భావించటానికి సాయపడింది.

 ఒవైసీ పేలవ ప్రభావం
 అక్బరుద్దీన్ ఒవైసీ మజ్లిస్ పార్టీ బిహార్ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపిస్తుందని, అది బీజేపీకి లాభిస్తుందని లెక్కగట్టారు. కానీ ఒవైసీని ఓట్లు చీల్చే వ్యక్తిగా చిత్రీకరించటంలో మహాకూటమి సఫలమైంది. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో ప్రభావం చూపటంలో విఫలమయ్యారు.
 
 స్థానిక నాయకత్వం కొరత
 రాష్ట్ర నేతలు బీజేపీకి అత్యంత బలంగా ఉన్న కాలం గతంలో ఉంది. గుజరాత్‌లో మోదీ, మధ్యప్రదేశ్‌లో శివరాజ్, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్, రాజస్తాన్‌లో వసుంధరరాజే వంటి వారున్నారు. కానీ మోదీ ప్రధానిగా ఎదిగాక.. బీజేపీలోకి కేంద్రీకరణ పోకడ పెరిగింది. రాష్ట్ర నేతలు నామమాత్రమయ్యారు. వారి భాగస్వామ్యం లాంఛన ప్రాయంగానే మారింది. బిహార్ వంటి హోరాహోరీ పోరులో.. అనాసక్తంగా ఉన్న స్థానిక నాయకత్వం బీజేపీకి పెద్ద లోపం.
 
 వి.కె.సింగ్ ‘కుక్క’ వ్యాఖ్య
 ఫరీదాబాద్‌లో ఇద్దరు దళిత చిన్నారుల హత్య నేపథ్యంలో.. కుక్కపై రాయి విసిరినపుడు దానికి ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేయరాదంటూ కేంద్రమంత్రి వి.కె.సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్య.. మహాకూటమి దళిత ఓట్లపై తన పట్టును బలోపేతం చేసుకోవటానికి మరో అవకాశమిచ్చింది.
 
 సంఘ్ కోటా వ్యాఖ్యలు

 కులాల ప్రాతిపదికగా ఉన్న రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్య.. మహాకూటమికి ‘ఫ్రీ హిట్’గా కలసి వచ్చింది. దీంతో ఈ ఎన్నికలను అగ్రవర్ణాలు - వెనుకబడిన వర్గాల వారికి మధ్య పోటీగా లాలూ అభివర్ణించారు. తాము ఒక ఓబీసీ నేతను సీఎం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చినా ఫలితం లేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement