వక్రతుండ.. మహాకాయ | Sakshi
Sakshi News home page

వక్రతుండ.. మహాకాయ

Published Wed, Sep 16 2015 2:18 AM

Three powerful of Vinayaka at Khairathabad

ఈసారి త్రిశక్తిమయ మోక్ష గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేశుడు  
 59 అడుగుల ఎత్తు.. 5,600 కిలోల లడ్డూ.. 75 అడుగుల యజ్ఞోపవీతం


 గణనాథుడి గ‘ఘన’ రూపాన్ని దర్శించుకోవాలన్నా... గౌరీతనయుడి ప్రత్యేకతలను కనులారా వీక్షించాలన్నా ఖైరతాబాద్‌కు క్యూ కట్టాల్సిందే.. వక్రతుండుడు ఇక్కడ ఎప్పుడూ మహాకాయుడే.. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఏటా ఒక్కో అడుగు పెరిగే ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ప్రతిఏటా ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే ఇక్కడి లంబోదరుడు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంటాడు. అవేంటో ఒకసారి తెలుసుకుందామా...    
 - హైదరాబాద్
 
 గ‘ఘన’ స్వరూపం..
 ఖైరతాబాద్ వినాయకుడంటేనే ఆకాశమంత ఎత్తు... అబ్బురపరిచే రూపం.. ఈసారి త్రిశక్తిమయ మోక్ష గణపతిగా 59 అడుగుల ఎత్తులో ఇక్కడి మూషికవాహనుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రధాన విగ్రహానికి కుడివైపు గజేంద్ర మోక్షం, ఎడమ వైపున వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది నుంచి గణేశుడి ఎత్తు ఒక్కో ఏడాది ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు.  
 
 పత్రం..ఫలం.. ఘనం..
- ప్రతి  ఏటా మాదిరిగానే ఇక్కడి మహాగణపతికి ఖైరతాబాద్ పద్మశాలి సంఘం 75 అడుగుల యజ్ఞోపవీతం, 80 అడుగుల పొడవైన కండువాను సమర్పిస్తారు. వీటిని నల్లగొండ జిల్లాలో తయారు చేయించారు.
 -    తొలిసారిగా నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి హ్యాండ్లూమ్ విలేజ్ వారు ప్రత్యేకంగా తయారు చేసిన 60 అడుగుల కండువాను చవితి రోజున మహా గణపతికి సమర్పించనున్నారు.
 -    11 రోజుల పాటు గణపయ్యకు అంబికాదర్బార్ కంపెనీ అగర్‌బత్తి మహాధూపాన్ని సమర్పిస్తోంది. ఈ ఏడాది 10 అడుగుల అగర్‌బత్తిని తయారు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఏలూరులో 15 రోజుల పాటు 10 మంది కార్మికులు కలసి దీన్ని రూపొందించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటలకు ఈ అగర్‌బత్తి మహాగణపతి ప్రాంగణానికి చేరుకుంటుందని అంబికా సేల్స్ మేనేజర్ మహేందర్ చెప్పారు.
 
 20 టన్నుల స్టీలు.. 200 లీటర్ల రంగు..
 ప్రధాన శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో విగ్రహాల తయారీని జూన్ 12 న మొదలుపెట్టారు. సెప్టెంబర్ 10 నాటికి పనులన్నీ పూర్తయ్యాయి. మహాగణపతి విగ్రహం తయారీకి 20 టన్నుల స్టీలు, 34 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, 75 బండిళ్ల కొబ్బరి నార, 600 బ్యాగుల బంకమట్టి, 30 లీటర్ల ఫెవికాల్, 50 సబ్బులు, 40 లీటర్ల నూనె, 22 టన్నుల కర్రలు, 200 లీటర్ల రంగులను వినియోగించినట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు.

గులాబీ, పసుపు, ఎరుపు వర్ణంలో ప్రతి ఏటా దర్శనమిచ్చే ఇక్కడి గణపయ్య రంగు ఈ ఏడాది మారింది. నీలిమేఘ వర్ణంలో ఈసారి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు కనువిందు చేయనున్నాడు. మొత్తంగా విగ్రహాల తయారీకి రూ. 50 లక్షలు ఖర్చైనట్లు నిర్వాహకులు చెప్పారు.
 
 తాపేశ్వరం నుంచి మహాలడ్డూ..
 ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు 5,600 కిలోల భారీ లడ్డూను ఖైరతాబాద్ గణేశుడికి సమర్పించనున్నారు. మహా ప్రసాదం తయారీ సోమవారం రాత్రికి పూర్తయినట్లు తెలిపారు. బుధవారం తాపేశ్వరం నుంచి హైదరాబాద్‌కు ఈ ప్రసాదాన్ని తరలించనున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement