రాజధానిలో ‘గృహ దీక్ష’ | Sakshi
Sakshi News home page

రాజధానిలో ‘గృహ దీక్ష’

Published Thu, Sep 24 2015 9:07 AM

ఇంటి వద్దే నిరసన చేపట్టిన దళితులకు మద్దతు తెలుపుతున్న సీపీఎం రాజధాని సమన్వయ కమిటీ కన్వీనర్ బాబూరావు - Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని కోసం అంటూ తమ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి కౌలు చెక్కులు చెల్లించకపోవడంపై ఆగ్రహించిన దళితరైతులు తుళ్లూరులో బుధవారం గృహదీక్షకు దిగారు. ఈ ప్రాంతంలో నిరసనలను అణచడానికి ప్రభుత్వం గత కొద్ది రోజులుగా 144 సెక్షన్ అమలు చేస్తున్న నేపథ్యంలో దాదాపు 30 కుటుంబాల వారు తమ కుటుంబ సభ్యులతో ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు.

ఎవరి ఇళ్ల వద్ద వారే తమ డిమాండ్లతో కూడిన బ్యానర్‌లు కట్టుకుని, నోటికి నల్లగుడ్డలు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఒక్క తుళ్లూరు గ్రామంలోనే 380 మంది దాదాపు 206 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుని బతుకుతున్నారు. భూ సేకరణలో స్వాధీనం చేసుకున్న మిగిలిన భూములకు కౌలు అందించిన ప్రభుత్వం దళితుల భూమికి కౌలు చెక్కులు ఇవ్వకపోడంతో వారు ఆందోళన బాట పట్టారు.  సీపీఎం రాజధాని సమన్వయ కమిటీ నేతలు సీహెచ్ బాబూరావు, ఎం.రవి, వీర్ల అంకయ్యలు వీరి ఇళ్లకు వెళ్లి మద్దతు తెలిపారు.

కాగా, ఎకరా అసైన్డ్ భూమికి 800 గజాల నివాసస్థలం, వంద గజాల కమర్షియల్ స్థలం ఇచ్చేలా నిర్ణయించారు. అయితే దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్న భూములు గుంజుకున్న ప్రభుత్వం మిగిలిన భూములకు మాదిరిగా ప్యాకేజీ వర్తింపజేయకపోగా ఇప్పటి వరకూ కౌలు చెక్కులు కూడా ఇవ్వలేదు.

144సెక్షన్ ఎత్తివేశాం అంటూనే పోలీస్ పహారా
రాజధాని ప్రాంతంలో ఈ నెల 11 నుంచి అమలు చేస్తున్న 144 సెక్షన్‌ను మంగళవారం ఎత్తివేసినట్టు పోలీసులు ప్రకటించారు. కానీ పోలీసులు దళితవాడల్లో పహారా కాశారు.

Advertisement
Advertisement