Sakshi News home page

‘కోటి’ లెక్కలు లూటీ కొరకే!

Published Thu, Aug 18 2016 1:31 AM

‘కోటి’ లెక్కలు లూటీ కొరకే! - Sakshi

అసెంబ్లీలో సీఎం చెప్పిన కోటి ఎకరాల లెక్కలను కొట్టిపారేసిన టీపీసీసీ
♦ 2004-14 మధ్యే 51.47 లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం
♦ సాగుయోగ్య భూమి 1.11 కోట్ల ఎకరాలైతే..
♦  కొత్తగా నీరివ్వాల్సింది 12.53 లక్షల ఎకరాలకు మాత్రమే
♦ దానికే రూ.1.5 లక్షల కోట్లు ఖర్చా?.. కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్
♦ పాలమూరు టెండర్ల ప్రక్రియలో అవకతవకలు..


సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైనింగ్‌పై శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పిన అంశాలన్నీ కాకి లెక్కలేనని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఆయన చెప్పిన కోటి ఎకరాల లెక్కలు కేవలం లూటీ కోసమేనని విమర్శించింది. కోటి ఎకరాల ప్రణాళిక తమ హయాంలోనే పూర్తయిందని పేర్కొంది. ఇప్పుడు మీరు నీరిచ్చేందుకు గాల్లో భూమిని సృష్టిస్తారా అని ఎద్దేవా చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ వెనుక కమీషన్ల కక్కుర్తి దాగుందని ఆరోపించింది. పాలమూరు ప్రాజెక్టులకు నీళ్లెక్కడున్నాయని నిలదీసింది. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులను పక్కన పెట్టి.. కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులకు బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయిస్తున్నారని దుయ్యబట్టింది. ఈ అంశాలన్నింటితో ‘తెలంగాణ వాస్తవ జలదృశ్యం’ పేరిట బుధవారం హైదరాబాద్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో టీపీసీసీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.

శాసనసభలో సీఎం కేసీఆర్ పేర్కొన్న వివరాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల వెనుక కుట్ర ఉందని ముఖ్యమంత్రి చేసిన విమర్శలకు జవాబిస్తూనే... ప్రస్తుతం కేసీఆర్ చెబుతున్న కోటి ఎకరాలు కాకిలెక్కలని విమర్శించింది. 1956 నుంచి 2004 మధ్య, 2004 నుంచి 2014 మధ్య ప్రాజెక్టుల నిర్మాణం, సాగు వివరాలను వెల్లడించింది. నిర్మాణంలోని ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, కొత్త ప్రాజెక్టులపై చూపుతున్న ఆసక్తిని ఎత్తి చూపింది.

‘కోటి’ఎకరాల ప్రణాళిక మాదే..
 కోటి ఎకరాలకు నీరిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలన్నీ అవాస్తవమని టీపీసీసీ విమర్శించింది. నిజానికి రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరిచ్చేలా కాంగ్రెస్ హయాంలోనే ప్రణాళిక పూర్తయిందని పేర్కొంది. 1956 నాటికే రాష్ట్రంలో 17.38 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని... 2004 వరకు అది 47 లక్షల ఎకరాలకు చేరిందని తెలిపింది. 2004-14 మధ్య చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మరో 51.47 లక్షల ఎకరాలకు నీరిచ్చే కార్యాచరణ పూర్తయిందని.. మొత్తంగా దాదాపు కోటి ఎకరాలకు తమ హయాంలోనే ప్రణాళిక పూర్తయిందని స్పష్టం చేసింది. మరి కొత్తగా సీఎం చెబుతున్న మరో కోటి ఎకరాలు ఎక్కడివని ప్రశ్నించింది. రాష్ట్రంలో సాగుయోగ్య భూమి 1.11 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటికే 98.47 లక్షల ఎకరాలకు ప్రణాళిక ఉందని తెలిపింది. మిగతా 12.53 లక్షల ఎకరాలకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తారా? అని నిలదీసింది. సీతారామ, దేవాదుల, ఎస్‌ఆర్‌ఎస్పీ, ఎఫ్‌ఎఫ్‌సీ వంటి ప్రాజెక్టులతో 75 లక్షల ఎకరాలకు నీరిస్తామని ముఖ్యమంత్రి చెప్పనవన్నీ కాకిలెక్కలేనని విమర్శించింది.
 
 2004- 2014 వరకు ప్రాజెక్టులు, ఆయకట్టు వివరాలు
 మొత్తం ఆయకట్టు 51,47,482 ఎకరాలు
 పెద్ద ప్రాజెక్టుల కింద 47,28,317 ఎకరాలు
 మధ్య తరహా ప్రాజెక్టుల్లో 1,83,610 ఎకరాలు
 చిన్న తరహా ప్రాజెక్టుల్లో 2,35,555 ఎకరాలు
 
రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తే 29.8 లక్షల ఎకరాలకు నీరు

తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులను టీపీసీసీ తమ ప్రజెంటేషన్‌లో ప్రధానంగా ప్రస్తావించింది. 80 నుంచి 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంది. కేవలం రూ.9వేల కోట్లు ఖర్చు చేస్తే... 283 టీఎంసీలను అందుబాటులోకి తెచ్చి, 29.8 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చని స్పష్టం చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం రూ. 860కోట్లు ఖర్చు చేస్తే.. 7,93,250 ఎకరాలకు నీరిచ్చే అవకాశమున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించింది. అదే కొత్తగా తెచ్చిన పాలమూరు ప్రాజెక్టుకు మాత్రం రూ.8వేల కోట్లు కేటాయించారని పేర్కొంది.
 
ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందెప్పుడు?
సాగునీటి రంగంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన విప్లవం కారణంగానే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ భారీ ప్రగతి సాధించిందని టీపీసీసీ పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే చర్యల ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి 2003-04లో ఉన్న 57.99 లక్షల టన్నుల నుంచి... 2013-14 నాటికి ఏకంగా 107.49 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపింది. గత రెండేళ్లలో మాత్రం ఉత్పత్తి 30 నుంచి 50 శాతం పడిపోయిందని విమర్శించింది.

ఆహార ధాన్యాల ఉత్పత్తి వివరాలు
 ఏడాది    ఉత్పత్తి (లక్షల టన్నుల్లో)
 1955-56    13.78
 2003-04    57.99
 2013-14    107.49
 2014-15    72.18
 2015-16    49.35


Advertisement

What’s your opinion

Advertisement