గిరిజనులు లేకుండా వనజాతర | Sakshi
Sakshi News home page

గిరిజనులు లేకుండా వనజాతర

Published Mon, Jan 18 2016 3:11 AM

గిరిజనులు లేకుండా వనజాతర

పెత్తనం కోసం దేవాదాయ శాఖ యత్నాలు
* రెండేళ్ల క్రితమే ముగిసిన మేడారం ట్రస్ట్ బోర్డు కాలపరిమితి
* కొత్త కమిటీ ఏర్పాటును పట్టించుకోని సర్కారు

సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం.. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన మేడారం జాతర ఏర్పాట్లలో స్థానిక గిరిజన ఆదివాసీల ప్రమేయం కనిపించడం లేదు. జాతరపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మేడారం జాతర కమిటీ ఏర్పాటులో కాలయూపన చేస్తున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరగనుంది. పూర్తిగా గిరిజన సంప్రదాయాల ప్రకారం ఈ జాతర జరుగుతుంది.

కోటి మంది భక్తులు వస్తారనే అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సమ్మక్క-సారలమ్మ జాతర పాలకమండలి పదవీకాలం 2014 జనవరి 8న ముగిసింది. 2014లో జరిగిన జాతరను ట్రస్టుబోర్డు లేకుండానే నిర్వహించారు. ఇక ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి జాతర కావడంతో ఆదివాసీలకు ప్రాధాన్యత కల్పిస్తారని ఈ వర్గం వారు భావించారు. మేడారం ట్రస్టు బోర్డు ఏర్పాటు కోసం 2015 జూలైలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కమిటీని మాత్రం ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు.

2014 తరహాలో ఈసారి ఆలయ ట్రస్టీ ఏర్పాటు చేయకుండా, ఆదివాసీల ప్రమేయం లేకుండానే జాతరను పూర్తి చేసేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. మేడారం జాతర ట్రస్ట్ బోర్డు నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఆరు నెలలు గడుస్తున్నా దేవాదాయ శాఖ ఇప్పటికీ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.  
 
మరో నెలే గడువు..
మేడారం జాతర ఏర్పాట్ల కోసం రూ.101 కోట్లతో పనులు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. జాతర దగ్గరపడుతున్న సమయంలో స్థానిక ఆదివాసీ గిరిజనులకు పనుల్లో భాగస్వాములను చేయాల్సిన ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. కొత్త కమిటీ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేసినా... ఎంపిక ప్రక్రియకు గడువు లేదనే సాకుచెప్పి దాటవేసే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రస్ట్ బోర్డు ఎంపికకు నోటిఫికేషన్ ప్రకారం... దరఖాస్తులను పరిశీలించి దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.

దేవాదాయ శాఖ మంత్రి, సీఎం ఆమోదం తర్వాత పాలకమండలి ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేస్తుంది. మేడారం మహా జాతర మరో నెల రోజుల్లో జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచే భక్తులు భారీగా తరలివస్తారు. ఆలోపు మేడారం ఆలయ ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ గిరిజన జాతరలో తమకు చోటు దక్కకుండా చేస్తున్నారంటూ ఈ వర్గం వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
రాజకీయ జోక్యమూ...
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ట్రస్టుబోర్డులో చైర్మన్ సహా తొమ్మిది మంది సభ్యులు ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారే కచ్చితంగా ఉండాలి. ఒకరు మహిళా సభ్యురాలు తప్పనిసరి. రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడితో ట్రస్టు బోర్డు సభ్యుల నియామకంపై జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల్లో ఎవరికి ట్రస్టు బోర్డులో స్థానం కల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడమే ఈ ఆలస్యానికి కారణమని సమాచారం. గత జాతర సమయంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొనడంతో ట్రస్టుబోర్డు లేకుండానే జాతరను నిర్వహించారు. ఈ సారి కూడా అదే విధంగా వ్యవహరిస్తారా.. లేక ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేస్తారో చూడాల్సిందే.

Advertisement
Advertisement