మోదీ అమెరికాకు రా.. ట్రంప్‌ భారత్‌కు రా! | Sakshi
Sakshi News home page

మోదీ అమెరికాకు రా.. ట్రంప్‌ భారత్‌కు రా!

Published Wed, Jan 25 2017 9:00 AM

మోదీ అమెరికాకు రా.. ట్రంప్‌ భారత్‌కు రా! - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్య తొలి ఫోన్‌ సంభాషణ సుహృద్భావ వాతావరణంలో సాగింది. మోదీకి ఫోన్‌ చేసిన ట్రంప్‌.. భారత్‌ను నిజమైన స్నేహితుడిగా, భాగస్వామిగా అభివర్ణించారు. 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లు ఎదుర్కోవడంలో భారత్‌ నిజమైన స్నేహితుడు, భాగస్వామి' అంటూ మోదీతో ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా-భారత్‌ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతపరచడం, ఆర్థిక, రక్షణ రంగాల్లో బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. అంతేకాదు దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రాంతాల్లో భద్రతపైనా చర్చించారు. గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ట్రంప్‌ తొలిసారి మంగళవారం రాత్రి ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. అంతేకాకుండా ఈ ఏడాది చివర్లో అమెరికాకు రావాల్సిందిగా మోదీని ట్రంప్‌ ఆహ్వానించారు.

అధ్యక్షుడు ట్రంప్‌తో సుహృద్భావరీతిలో సంభాషించానని ప్రధాని మోదీ కూడా ట్విట్టర్‌లో తెలిపారు. రానున్న రోజుల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునేందుకు కలిసి సన్నిహితంగా పనిచేయాల్సిన అవసరంపై తాను, ట్రంప్‌ ఏకీభవించామని ఆయన పేర్కొన్నారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా ట్రంప్‌ను ఆహ్వానించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు.

Advertisement
Advertisement