ఇద్దరు కుర్ర హీరోలు.. కుమ్మేశారు | Sakshi
Sakshi News home page

ఇద్దరు కుర్ర హీరోలు.. కుమ్మేశారు

Published Thu, Aug 6 2015 4:47 PM

ఇద్దరు కుర్ర హీరోలు.. కుమ్మేశారు - Sakshi

ఇద్దరు హీరోలు.. ఇద్దరూ కుర్రాళ్లే.. కేవలం వాళ్లిద్దరే కలిసి అనేకమంది సైనికులను రక్షించారు. బీఎస్ఎఫ్ దళానికి చెందిన కానిస్టేబుల్ శుభేందురాయ్, రాకీ.. వీళ్లిద్దరు చూపించిన అసమాన ధైర్య సాహసాల వల్లే అనేకమంది జవాన్ల ప్రాణాలు పోకుండా ఆగాయి. ఉగ్రవాదుల్లో ఒకడు అక్కడికక్కడే హతం కాగా, మరొకడు సజీవంగా పట్టుబడ్డాడు. బుధవారం నాడు శుభేందురాయ్ 30 మంది సిబ్బందితో కూడిన బస్సు నడుపుతున్నాడు. అంతలో.. ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. వాళ్ల దగ్గర భారీస్థాయిలో ఆయుధాలున్నాయి.

ఒకడు కొండమీద పొజిషన్ తీసుకుని ఫైరింగ్ మొదలుపెట్టగా, రెండోవాడు బస్సును ఆపి ముందునుంచి కాల్చాడు. శుభేందురాయ్ గాయపడ్డాడు గానీ, ఉగ్రవాది నోమన్ బస్సులోకి రాకుండా ఆపాడు. డోరువద్దే వేలాడుతూ.. ఉగ్రవాదిని ఆపేశాడు. దాంతో నోమన్ బస్సు చుట్టూ తిరుగుతూ అన్నివైపులా కాలుస్తూ రెండోవైపు నుంచి బస్సులోకి ఎక్కే ప్రయత్నం చేశాడు. అప్పుడు బస్సు ముందుసీట్లో కూర్చున్న కానిస్టేబుల్ రాకీ లేచాడు. తన వద్ద ఉన్న ఇన్సాస్ రైఫిల్తో నోమన్ను ఎడా పెడా కాల్చిపారేశాడు. ఆ దెబ్బకు మ్యాగజైన్లో ఉన్న మొత్తం 40 బుల్లెట్లూ ఖాళీ అయిపోయాయి. నోమన్ చచ్చిపోతూ.. ఓ గ్రెనేడ్ను బస్సు డోరు వద్ద వదిలేశాడు. ఈలోపు అతడు తన ఏకే47తో కాల్చడంతో కానిస్టేబుళ్లు శుభేందు రాయ్, రాకీ ఇద్దరూ మరణించారు.

అయితేనేం.. బస్సులో ఉన్న మొత్తం జవాన్లందరి ప్రాణాలూ కాపాడారు. ఆ ఉగ్రవాదులే లోనికి వచ్చి ఉంటే.. తమవద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతో మొత్తం అందరినీ హతమార్చి ఉండేవాళ్లేమో! మరో జవాను కూడా ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇదంతా చూసిన నావేద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసింఖాన్ అక్కడినుంచి పారిపోయాడు. కానీ, అతడిని గ్రామస్థులు పట్టుకుని భద్రతా దళాలకు అప్పగించారు. కసబ్ తర్వాత సజీవంగా దొరికిన ఏకైక పాక్ ఉగ్రవాది ఇతడే. అయితే అతడు తమ దేశస్థుడు కాడని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement