సమైక్యతే లక్ష్యంగా.. 123 రోజుల జనోద్యమం | Sakshi
Sakshi News home page

సమైక్యతే లక్ష్యంగా.. 123 రోజుల జనోద్యమం

Published Sun, Dec 1 2013 1:13 AM

సమైక్యతే లక్ష్యంగా.. 123 రోజుల జనోద్యమం - Sakshi

సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 123వ రోజూ శనివారం సీమాంధ్ర జిల్లాల్లో సాగింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు.. ఇలా విభిన్న రూపాల్లో సమైక్యవాదులు రాష్ర్టం కలిసే ఉండాలన్న ఆకాంక్షను చాటారు.  పశ్చిమగోదావరి జిల్లా  భీమవరంలో  విద్యార్థులు, జేఏసీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. విద్యార్థులు 123 సంఖ్య ఆకారంలో కూర్చుని సమైక్య నినాదాలు చేశారు. కృష్ణాజిల్లా కలిదిండిలో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

 టీ-బిల్లు పెడితే మెరుపు సమ్మె:  విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడితే మెరుపు సమ్మెకు దిగుతామని సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ పోలాకి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన విశాఖపట్నంలో ఒక ప్రకటనలో విడుదల చేశారు. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌథ వద్ద సమైక్యాంధ్ర ధర్నాలో తెలంగాణ ఇంజనీరు సీమాంధ్రకు చెందిన ఓ మహిళా ఉద్యోగినిపై పరుష పదజాలంతో దూషణలకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

 కొనసాగుతున్న వైఎస్సార్సీపీ శ్రేణుల దీక్షలు
 సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీమాంధ్ర జిల్లాల్లో చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా కైకలూరులో ఈ దీక్షలు 116వ రోజుకు చేరాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు,  చిత్తూరు జిల్లా పలమనేరు, తిరుపతిలో చేపట్టిన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ఇక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శనివారం పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు గ్రామాల్లోకి వెళ్లి గడపగడకూ వైఎస్సార్ సీపీ సమైక్యనాదం పేరిట పాదయాత్రలు చేపట్టారు. సమైక్యాంధ్ర ఆవశ్యకత, రాష్ట్ర సమైక్యతకు పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న అవిరళకృషిని ప్రజలకు వివరిస్తున్నారు.

Advertisement
Advertisement