రెండేళ్ల పిల్లాడిపై దోపిడీ కేసు! | Sakshi
Sakshi News home page

రెండేళ్ల పిల్లాడిపై దోపిడీ కేసు!

Published Thu, Oct 1 2015 9:18 AM

రెండేళ్ల పిల్లాడిపై దోపిడీ కేసు!

ఉత్తరప్రదేశ్ పోలీసులకు చదవేస్తే ఉన్నమతి పోయినట్లుంది. కేవలం ఎఫ్ఐఆర్లో పేరుందన్న కారణంగా రెండేళ్ల అబ్బాయిపై దోపిడీ కేసు నమోదు చేశారు. అంతేకాదు.. అసలు ఫిర్యాదులో ఏముందో చూసుకోకుండా, ఆ పిల్లాడిని అరెస్టు చేసేందుకు అతడి ఇంటికి కూడా వెళ్లారు. ఆ పిల్లాడి తండ్రి వెళ్లి, ఇదేంటని మొరపెట్టుకున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు.. ఇప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ నుంచి పిల్లాడి పేరు తీసేస్తామని చెబుతున్నారు.

విషయం ఏమిటంటే.. యూపీలోని బజేరా గ్రామానికి చెందిన అమిత్ కుమార్, అతడి ఇంటి ఇరుగుపొరుగువాళ్లు కలిసి కొందరు ఓ దోపిడీ దొంగను పట్టుకున్నారు. అతడు తనపేరు భరత్ అని, తనకు మరో వ్యక్తి సహకరించాడని చెప్పాడు. పోలీసులు ఆ రెండో వ్యక్తి పేరు కూడా ఎఫ్ఐఆర్లో రాసేశారు. తీరా అరెస్టు చయడానికి ఇంటికి వెళ్తే, అతడు రెండేళ్ల పిల్లాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. పోలీసులు ఆ మాట నమ్మలేదు. ఆ కుటుంబాన్ని వేధించారు. తర్వాతి రోజు ఆ తల్లిదండ్రులు పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి, విషయం చెప్పారు. మీడియాకు విషయం తెలిసి అది కాస్తా భగ్గుమన్న తర్వాత.. అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వాళ్లు అతడి పేరును ఎఫ్ఐఆర్ నుంచి తీసేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement