ఉపహార్ కేసులో రియల్టర్‌కు జైలు..జరిమానా | Sakshi
Sakshi News home page

ఉపహార్ కేసులో రియల్టర్‌కు జైలు..జరిమానా

Published Thu, Feb 9 2017 12:17 PM

ఉపహార్ కేసులో రియల్టర్‌కు జైలు..జరిమానా - Sakshi

న్యూఢిల్లీ: తీవ్ర విషాదాన్ని నింపిన ఉపహార్ సినిమా థియేటర్ ఉదంతం పై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.  ఈ కేసులో రియల్టర్‌, ఉపహార్‌  థియేటర్ యజమాని గోపాల్ అన్సల్‌ కి  ఏడాది  జైలు శిక్షను ఖరారు చేసింది.  దీంతోపాటు రూ.30 కోట్లను పరిహారం  చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసును పాక్షికంగా విచారించిన కోర్టు 2.1 మెజార్టీతో తీర్పును వెలువరించింది.  నాలుగు వారాల్లోగా  కోర్టు ముందు లొంగి పోవాలని ఆదేశించింది. ఇప్పటికే నాలుగు నెలలుగా జైల్లో శిక్షను అనుభవించిన  ఆయన మిగిలిన  శిక్షా కాలాన్ని  పూర్తి చేయాలని తీర్పు చెప్పింది.    

అయితే మరో యజమాని సుశీల్ అన్సల్‌ ను మాత్రం  జైలు నుంచి తప్పించుకున్నారు. అతని వయసును దృష్టిలోపెట్టుకున్న సుప్రీం అయిదునెలల జైలు శిక్షను విధించింది. అయితే  ఇప్పటికే ఆయన  5నెలల శిక్షను అనుభవించడంతో ఆయన శిక్షా కాలం పూర్తియినట్టే.  అయితే సుశీల్‌ కూడా రూ. 30కోట్లను పరిహారం  చెల్లించాలని  పేర్కొంది.

అయితే ఈ తీర్పుపై  బాధిత అసోసియేషన్ అధ్యక్షులు నీలం కృష్ణమూర్తి  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. కోర్టును ఆశ్రయించి తన జీవితంలో అతి పెద్ద తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా జూన్ 13, 1997లో ఉపహార్ సినిమా థియేటర్‌ లో జరిగిన  అగ్నిప్రమాదంలో 59 మంది అగ్నికి ఆహుతయ్యారు.  వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు.  దీనిపై బాధితులు  ఉపహార్ బాధితుల అసోసియేషన్ గా ఏర్పడి గత 20 ఏళ్లుగా  పోరాడుతున్నారు.  అయితే ఈ కేసు డిసెంబర్ 19, 2009న విచారించిన ఢిల్లీ హైకోర్టు  థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్, ఢిల్లీ అగ్ని మాపక శాఖ సిబ్బంది హెచ్‌ఎస్ పన్వర్‌లకు ఏడాది జైలు శిక్ష విధించింది. అనంతరం తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆ తరువాత ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. అగ్ని ప్రమాదానికి అన్సల్ సోదరులను దోషులుగా ప్రకటించిన న్యాయస్థానం శిక్ష విధించే విషయంలో న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించిన  సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement