జిందగీలో పాకిస్తానీ షోలు బంద్ | Sakshi
Sakshi News home page

జిందగీలో పాకిస్తానీ షోలు బంద్

Published Sat, Sep 24 2016 3:37 PM

జిందగీలో పాకిస్తానీ షోలు బంద్ - Sakshi

ఉడి ఉగ్రదాడి ఘటన భారత్-పాకిస్తాన్ల మధ్య తీవ్ర చిచ్చును రేపింది. ఓవైపు పాకిస్తానీ నటీనటులు, ఆర్టిస్టులను భారత్ విడిచిపోవాలని అల్టిమేటం జారీ కాగా.. మరోవైపు పాకిస్తాన్కు సంబంధించిన ఏ ప్రోగ్రామ్లను ప్రసారం చేయకూడదని జిందగీ చానల్ నిర్ణయించింది. జిందగీ చానల్లో ప్రసారమయ్యే పాకిస్తానీ షోలన్నింటిన్నీ ప్రసారం చేయకుండా ఆపివేయడానికి ప్లాన్ చేస్తున్నామని జీమీడియా నెట్వర్క్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్ర వెల్లడించారు. అదేవిధంగా పాకిస్తాన్కు చెందిన నటులందరినీ భారత్ విడిచిపోవాలని కూడా ఆదేశించారు.  ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన అనుచిత వ్యాఖ్యల అనంతరం సుభాష్ చంద్ర ఈ నిర్ణయం ప్రకటించారు. 
 
జమ్మూ కశ్మీర్ వేర్పాటు వాది బుర్హన్ వానిని యువ నాయకుడిగా నవాజ్ షరీఫ్ కీర్తించడంతో పాటు, కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ మండిపడింది. నవాజ్ షరీఫ్ ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ట్విట్టర్ ద్వారా సుభాష్ చంద్ర తన అభిప్రాయాన్ని వెల్లడించారు.  పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీల నుంచి హిందీ, ఉర్దూ ప్రోగ్రామ్లను టెలివిజన్ చానలె జిందగీ ప్రసారం చేస్తోంది. దీనిలో జిందగీ గుల్జార్ హై, హమ్సఫర్ వంటి షోలు పాకిస్తాన్ నుంచి ప్రసారం అవుతున్నాయి. ఈ ప్రోగ్రామ్లన్నింటినీ టెలికాస్ట్ చేయడం ఆపివేస్తామని సుభాష్ చంద్ర తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ నటీనటులు, ఆర్టిస్టులు 48 గంటల్లో ఇండియా వదిలి వెళ్లి పోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అల్టిమేటం జారీచేసింది. 

Advertisement
Advertisement