నోట్ల రద్దుపై అగ్రరాజ్యం ఏమందో తెలుసా? | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై అగ్రరాజ్యం ఏమందో తెలుసా?

Published Thu, Dec 1 2016 3:15 PM

నోట్ల రద్దుపై అగ్రరాజ్యం ఏమందో తెలుసా? - Sakshi

ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్లు రూ.500, రూ.1000 రద్దుపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భారత్ తీసుకున్న పెద్దనోట్ల రద్దుకు తాము మద్దతు పలుకుతున్నట్టు అగ్రరాజ్యం అమెరికా గురువారం వెల్లడించింది.  అవినీతిని అంతమొందిచడానికి పెద్ద నోట్ల రద్దు ఎంతో ముఖ్యమైన, అవసరమైన చర్యగా అమెరికా అభివర్ణించింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలన్నింటికీ ఫుల్స్టాఫ్ పెట్టడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తాము విశ్వసిస్తున్నట్టు స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ప్రతినిధి మార్క్ టోనర్ తెలిపారు.
 
'' భారత్లో నివసించే, పనిచేసే అమెరికా సిటిజన్లకు దీనిపై సరియైన సమాచారం అందే ఉంటుందని నేను భావిస్తున్నా. వారు పాత నోట్లను మార్చుకుని కొత్త నోట్లను తీసుకునే ఉంటారు. పెద్ద నోట్ల రద్దు వల్ల చాలామంది భారతీయులకు కొంత అసౌకర్యం ఏర్పడింది. భారతీయులతో పాటు అమెరికన్లు ఈ అసౌకర్యం ఏర్పడి ఉండొచ్చు. కానీ తమ రాయబారి ద్వారా అమెరిక సిటిజన్లకు భారత్లో జరుగుతున్న మార్పులను గురించి వివరించాం. అవినీతిని నిర్మూలించడానికి పెద్ద నోట్ల రద్దు ఎంతో ముఖ్యమైన చర్య, దీనికి మా మద్దతు ఉంటుంది'' అని టోనర్ చెప్పారు. అవినీతితో పాటు, పన్ను ఎగవేతదారులను టార్గెట్గా చేసి ఈ చర్యను భారత్ తీసుకుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement