చైనా-పాక్ లను ట్రంప్ వ్యతిరేకిస్తారా? | Sakshi
Sakshi News home page

చైనా-పాక్ లను ట్రంప్ వ్యతిరేకిస్తారా?

Published Thu, Nov 10 2016 12:14 PM

చైనా-పాక్ లను ట్రంప్ వ్యతిరేకిస్తారా? - Sakshi

న్యూఢిల్లీ: డోనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయంతో భారత్-అమెరికా భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం మొదలైంది. మరి భారత్ తో భాగస్వామ్యానికి ట్రంప్ ఎలాంటి దౌత్య విధానాల(ఫారిన్ పాలసీ)ను అనుసరిస్తారు?. అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే వచ్చే ఏడాది జనవరి 20 వరకూ ఆగాల్సిందే. అయితే, ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చేసిన వాగ్ధానాలను బట్టి చూస్తే మాత్రం ఆయన దౌత్య విధానాలు భారత్ కు అనుకూలించేలాగే ఉన్నాయి.

ప్రచారంలో భాగంగా భారత్ ను ఉద్దేశించి ట్రంప్ పలుమార్లు ప్రసంగించారు. భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని అన్నారు. అమెరికన్ల ఉద్యోగాలను దొంగిలిస్తున్న దేశం కూడా భారతేనని, టెర్రరిస్టులు భారత్ ను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా అమెరికాకు ధీటుగా పోటీ పడేందుకు సిద్ధమవుతున్న చైనాపై ఆయన కొంత విముఖతను ప్రదర్శించారు.

చైనాకు అడ్డుకట్ట వేసేందుకు ఆసియాలో కీలక దేశాలైన దక్షిణ కొరియా, జపాన్లు ఆయుధ సంపత్తిని పెంపొందించుకోవాలని సూచించారు. దక్షిణ చైనా సముద్రంలో(ఎస్సీఎస్) అమెరికా సాయుధదళాలను పెంచుతామని ప్రకటించారు. అందువల్ల ఫిలిప్పీన్స్ విధానాలను మిగతా దేశాలను అనుసరించాల్సిన అవసరం తప్పుతుంది. దీంతో ట్రంప్ వ్యాఖ్యలను జపాన్, భారత్ లు స్వాగతించాయి. నిబంధనలను ఉల్లంఘిస్తూ చైనా చేస్తున్న వ్యాపార లావాదేవీలను భారత్ లాంటి దేశాలు సొంత లావాదేవీలతో తిప్పికొట్టాలని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.

అయితే, ట్రంప్ సొంతలాభాన్ని చూసుకునే అవకాశం లేకపోలేదు. ఆయన ప్రచార కార్యక్రమం మొత్తం అమెరికాలో వేళ్లూనుకుపోయిన ఇతర దేశాల వారిని బయటకు పంపి అమెరికన్లకే అవకాశాలు దక్కేలా చేయడం లాంటి వాటిపైనే సాగింది. ఈ విషయంలో భారత్-అమెరికాలో మధ్య కొంత గంభీర వాతావరణం నెలకొల్పే అవకాశం ఉంటుంది. పసిఫికేతర వాణిజ్య భాగస్వామ్యం(టీపీపీ)పై ట్రంప్ ముందుకెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇది ఒక రకంగా భారత్ మంచికే. టీపీపీ ద్వారా వాణిజ్య కార్యకలాపాలు సాగించేందుకు భారత్ ఇంకా అర్హత సాధించలేదు.

రష్యాతో సంబంధాలు పెంపొందించుకుంటానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా భారత్ కు అనుకూలించేవే. మరో అడుగు ముందుకేసి రష్యాను ఏ మాత్రం శత్రువుగా భావించబోనని ట్రంప్ ప్రపంచానికి చాటి చెప్పారు. అదే విధంగా ట్రంప్ అధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్ సమర్ధించిన విషయం కూడా తెలిసిందే. ట్రంప్ ప్రచారంలో చెప్పినట్లు నడుచుకుంటే ఆసియాలో రష్యా తిరుగులేని శక్తిగా తయారవుతుంది. దీంతో భారత్ కు బెడదగా మారుతున్న చైనా కు చెక్ పడుతుంది.  

అప్ఘనిస్తాన్-పాకిస్తాన్, పశ్చిమ ఆసియా దేశాలపై ట్రంప్ ఎలా వ్యవహరించనున్న తీరు భారత్ కు కీలకం కానుంది. ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకోవడానికి సాయం చేసిన డాక్టర్ షకిల్ అఫ్రిదిని జైలు నుంచి విడుదల చేయాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. బిన్ లాడెన్ ను అమెరికా సైన్యం హతమార్చిన తర్వాత పాకిస్తాన్ అఫ్రిదిని ఖైదు చేసింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే తొలినాళ్లు భారత్ కు మరింత కీలకంగా మారనున్నాయి. సరికొత్త టీమ్ తో భారత్ అమెరికాతో సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement
Advertisement