Sakshi News home page

270 మంది భారతీయులపై ట్రంప్ వేటు

Published Sat, Mar 25 2017 9:01 AM

270 మంది భారతీయులపై ట్రంప్ వేటు - Sakshi

న్యూఢిల్లీ : అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న 200 మందికి పైగా భారతీయులను ట్రంప్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. వారిపై దేశ బహిష్కరణ వేటు వేసేందుకు సిద్ధమైంది. 270 మందికి పైగా భారతీయులపై దేశ బహిష్కరణ వేటు వేయనున్నామని ట్రంప్ కార్యాలయం చెప్పినట్టు విదేశాంగమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా బహిష్కరించడానికి ముందే ఆ 271 మంది జాబితాను తమకు అందజేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని  భారత్ కోరినట్టు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంట్ కు తెలిపారు. ఈ వ్యక్తులకు సంబంధించిన జాతీయతను తాము పరిశీలించకంటే ముందే, వారందరూ అక్రమంగా అమెరికాలో ఉన్నట్టు తాము ఎలా విశ్వసిస్తామని ప్రశ్నించినట్టు సుష్మా పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించాలని అమెరికా ప్రభుత్వాన్ని అడిగినట్టు తెలిపారు.
 
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న విద్వేషపూరిత దాడులపై కూడా భారత్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. అయితే బహిష్కరణ జాబితాను తమకు అందించాలనే భారత్ అభ్యర్థనపై ట్రంప్ కార్యాలయం ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలుపలేదు. 2009-114 మధ్యకాలంలో 1,30,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు  ప్యూ రీసెర్చ్ సెంటర్ తమ సెప్టెంబర్ రిపోర్టులో పేర్కొంది. భారత్ నుంచి, ఆసియా నుంచి వచ్చిన చాలామంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యురిటీ స్టాటిస్టిక్స్ తెలిపింది.  ఇప్పటికే వీసా జారీలో కఠినతరం నిబంధనలను తీసుకొస్తున్న ట్రంప్ ప్రభుత్వం, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై కూడా ఉక్కుపాదం మోపేందుకు కఠిన చర్యలు ప్రారంభించింది. 

Advertisement
Advertisement