హెల్మెట్ వాడకంపై ఏమి చర్యలు తీసుకున్నారు? | Sakshi
Sakshi News home page

హెల్మెట్ వాడకంపై ఏమి చర్యలు తీసుకున్నారు?

Published Tue, Sep 8 2015 1:42 AM

హెల్మెట్ వాడకంపై ఏమి చర్యలు తీసుకున్నారు? - Sakshi

సాక్షి, హైదరాబాద్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించించింది. ఇందుకు 15 రోజుల గడువునిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వు లు జారీ చేసింది. హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించేలా చూడాలని అన్ని జిల్లాల రవాణాశాఖ అధికారులను ఆదేశిస్తూ కమిషనర్ ఈ నెల 2న  జారీచేసిన సర్క్యులర్‌ను ఎంతమేర అమలుచేశారో తెలుసుకోవాలనుకుంటున్నామని ధర్మాసనం స్పష్టంచేసింది.

తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. హెల్మెట్ వాడకంపై మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129ని కఠినంగా అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ 2009లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉడతనేని రామారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హైకోర్టు గత ఆదేశాల మేరకు తెలంగాణ రవాణాశాఖ కమిషనర్ తన కౌంటర్‌ను సోమవారం ధర్మాసనం ముందుంచారు.

కౌంటర్ దాఖలుతో సమస్య పరిష్కారం కాదని, హెల్మెట్‌ను తప్పనిసరిగా వాడే విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) అండేపల్లి సంజీవ్‌కుమార్ సమాధానమిస్తూ, వాహనం కొనుగోలు చేసేటప్పుడు హెల్మెట్ కొనుగోలు కూడా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశామని, హెల్మెట్ కొనుగోలు రసీదును సమర్పిస్తేనే వాహనం రిజిష్టర్ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.

‘ఈ నిబంధన హెల్మెట్ తయారీదారుల కోసమేనని అందరికీ తెలుసు. హెల్మెట్ కొనడం ముఖ్యం కాదు. హెల్మెట్ కొని ఇంట్లో పెడితే సరిపోతుందా? దానిని వాడటం ముఖ్యం. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్‌ను తప్పనిసరిగా వాడేం దుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి. మేం ప్రతీ రోజూ రోడ్లపై చూస్తూనే ఉన్నాం.. ఎంతో మంది హెల్మెట్ లేకుండా పోతున్నా పోలీసులు వారిని ఆపుతున్న దాఖలాలే లేవు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

2014 జూన్ నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్‌లతో సహా 92,164 మందిపై కేసులు పెట్టామని ఎస్‌జీపీ చెప్పగా, ఇవికాక ఇంకేం చర్యలు తీసుకున్నారని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏమైనా ప్రకటనలు ఇస్తున్నారా? అని ధర్మాసనం అడిగింది. మీకు 15 రోజుల గడువునిస్తున్నామని, ఈ లోపు ఏం ఫలితాలు సాధించారో తమ ముందుంచాలని కమిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement