స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది..భారీ కుదుపులు! | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది..భారీ కుదుపులు!

Published Wed, Mar 18 2015 12:13 AM

స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది..భారీ కుదుపులు! - Sakshi

యూటీఐ ఎంఎఫ్ ఈక్విటీ హెడ్ అనూప్ భాస్కర్ ‘సాక్షి’ ఇంటర్వ్యూ
 వృద్ధిరేటు అనుకున్నంత వేగంగా లేదు   
 ఈ ఏడాది 10-15 శాతం రాబడి అంచనా
 ఖరీదుగా ఉన్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లు

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
 గతేడాది దేశీయ స్టాక్ సూచీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం వస్తుందని, ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందన్న అంచనాలకు తోడు అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గిరావడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. కానీ ఈ ఏడాది మార్కెట్ గమనం ఏకపక్షంగా ఉండదని, ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందంటున్న యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ హెడ్ అనూప్ భాస్కర్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ...
 
 తాజా బడ్జెట్‌పై..
 ఆర్థిక మంత్రి తన లక్ష్యాలను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే విధంగా పలు చర్యలు తీసుకున్నారు. ఈ బడ్జెట్‌లో అతి ముఖ్యమైన అంశం జీఎస్‌టీ అమలు ప్రకటన. ఏప్రిల్ 1, 2016 నుంచి జీఎస్‌టీని ఎలా అమల్లోకి తీసుకువస్తారన్నదే ఇక గమనించాల్సిన అంశం. ఆర్థికలోటు నియంత్రణ లక్ష్యాన్ని 3.9 శాతానికి పెంచినా గణాంకాలన్నీ ఇన్వెస్టర్లను తృప్తిపర్చే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. జీడీపీ వృద్ధి మరీ ఎక్కువ లేకపోవడం, పన్నుల వసూళ్లు తక్కువగా ఉండటం వంటి కొన్ని స్వల్పకాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పీఎస్ యూ బ్యాంకులకు హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు, డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ. 43,000 కోట్ల నుంచి రూ. 69,500 కోట్లకు పెంచడం వంటి నిర్ణయాలు మార్కెట్‌కు ఊతమిచ్చేవే. కానీ ఇప్పటికే సెన్సెక్స్ 30,000, నిఫ్టీ 9,000 పాయింట్ల మార్కెట్‌ను తాకిన తరుణంలో ఈక్విటీ రాబడులపై అంచనాలు భారీగా పెరిగాయి. మార్కెట్ ఇదే విధంగా పెరగాలంటే మాత్రం.. కంపెనీల ఆదాయాలు, లాభాలు వాస్తవ రూపంలో ప్రతిబింబించాల్సి ఉంటుంది.
 
 అంత ఈజీ కాదు..
 గతేడాదిలా ఈ సంవత్సరం సూచీలు ఏకపక్షంగా లాభాలను అందించే పరిస్థితి కనిపించడం లేదు. కంపెనీల ఆదాయాల్లో వృద్ధి అంతంతమాత్రంగా ఉండటం, అంతర్జాతీయ పరిస్థితులు ఒడిదుడుకులకు కారణం కానున్నాయి. ఇప్పటికే ఆర్థిక వృద్ధిరేటు అంచనాలకంటే తక్కువగా ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి. దీంతో గతేడాదికంటే ఈసారి ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అవకాశముంది.
 
 మిడ్‌క్యాప్ ర్యాలీ ఆగిందా?..
 ఈ ర్యాలీలో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు బాగా పెరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న పతనాన్ని ర్యాలీకి కొద్దిగా విరామం వచ్చినట్లుగానే భావించాలి కానీ... ర్యాలీ అయిపోయిందని అప్పుడే భావించడానికి లేదు. మిడ్‌క్యాప్ షేర్లు నిఫ్టీ కంటే 1.8 రెట్లు అధిక స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. ఈ కంపెనీల ఆదాయాలు పెరగకపోతే.. ఈ స్థాయిలో నిలబడటం కష్టం. ఒక్కసారి లార్జ్‌క్యాప్ షేర్లలో పతనం మొదలైతే అంతకంటే ఎక్కువ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లు నష్టపోతాయి.

 రిటైల్ పెట్టుబడులు పెరిగాయ్
 రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల పట్ల తిరిగి ఆసక్తి వ్యక్తపర్చడం గతేడాది ముఖ్యమైన అంశాల్లో ఒకటి. 2014లో ఎఫ్‌ఐఐల కంటే రిటైల్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసిన మొత్తమే ఎక్కువ. 2008లోనూ ఇదే విధంగా జరిగింది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి.
 
 కలిసొస్తున్న ముడిచమురు
 అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుదల ప్రభావం ఈ ఏడాది కంపెనీల ఆదాయాల్లో ప్రతిఫలించే అవకాశాలున్నాయి. ఆ మేరకు కార్పొరేట్ ఆదాయాలు పెరగొచ్చు. ఆశించిన విధంగా వృద్ధిరేటు ఉండి, అంతర్జాతీయంగా ఎటువంటి ప్రతికూల సంఘటనలు ఎదురుకాకుండా ఉంటే.. ఈ ఏడాది స్టాక్ సూచీల నుంచి 10-15% రాబడి ఆశించొచ్చు.
 

Advertisement
Advertisement