మరోసారి వివాదంలో యూపీ సీఎం అఖిలేష్ | Sakshi
Sakshi News home page

మరోసారి వివాదంలో యూపీ సీఎం అఖిలేష్

Published Mon, Dec 30 2013 12:07 PM

మరోసారి వివాదంలో యూపీ సీఎం అఖిలేష్

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మరోసారి  వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. ఓ వైపు ముజఫర్‌ నగర్‌ అల్లర్ల బాధితులు సహాయ శిబిరాల్లో అల్లాడిపోతోంటే మరోవైపు అఖిలేష్‌ యాదవ్‌ గానా బజానాలో మునిగి తేలారు. సెఫాయ్‌ మహోత్సవ్‌ పేరిట సొంత ఊర్లో జరిగే వేడుకలకు అఖిలేష్‌,  ములాయం సహా ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సినిమా హీరోయిన్‌లను, డ్యాన్సర్లను పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి నృత్యాలు చేయించారు. పాటలు పాడించారు.... మస్తీలో మునిగి తేలారు.

ఓ పక్క సహాయ శిబిరాల్లో చలికి తట్టుకోలేక 34 మంది చిన్నారులు చనిపోయి ముజఫర్‌నగర్‌ బాధితులు విషాదంలో ఉంటే ములాయం కుటుంబసభ్యులు సైఫై వేడుకల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది. వేడుకలకు సీనియర్‌ మంత్రి ఆజంఖాన్‌ కూడా హాజరయ్యారు. అఖిలేష్‌ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

కాగా  సెఫాయ్‌లో అఖిలేష్ ప్రభుత్వం రెండు వందల కోట్లతో క్రీడా సముదాయాన్ని నిర్మించ తలపెట్టింది.  ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులను వదిలేసి సొంత గ్రామంలో రెండు వందల కోట్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేయటం ముఖ్యమా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముజఫర్ నగర్ బాధితులు శిభిరాల్లో కష్టాలు పడుతుంటే... . వారిని వదిలేసి స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం  కోట్లు ఖర్చు చేయడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే విమర్శలను ఏమాత్రం లెక్కచేయని అఖిలేష్ తన పని తాను చేసుకుపోవటం విశేషం.

Advertisement
Advertisement