..మొట్టమొదటి ఉపరాష్ట్రపతి వెంకయ్యే: మోదీ | Sakshi
Sakshi News home page

..మొట్టమొదటి ఉపరాష్ట్రపతి వెంకయ్యే: మోదీ

Published Fri, Aug 11 2017 11:58 AM

..మొట్టమొదటి ఉపరాష్ట్రపతి వెంకయ్యే: మోదీ - Sakshi

- స్వాతంత్ర్యానంతరం జన్మించినవారిలోవారిలో ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తి
- రాజ్యసభలో గుర్తుచేసిన ప్రధాని.. చైర్మన్‌ పీఠంపై నాయుడు


న్యూఢిల్లీ:
భారత 13వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టినవాళ్లలో.. ఉపరాష్ట్రపతి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు.

ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో గుర్తుచేయగానే సభ్యులంతా చప్పట్లతో హర్షాతిరేకాలను వ్యక్తంచేశారు. వెంకయ్య..1949, జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో వెంకయ్య నాయుడిచేత ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. అనంతరం నేరుగా రాజ్యసభకు వెళ్లిన వెంకయ్య.. చైర్మన్‌ పీఠంపై కూర్చొని సభను నడిపించారు. కొత్త ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ప్రధాని మోదీ, విపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు.

రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర్యం తరువాత జన్మించినవాళ్లలో ఉపరాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఇదొక అరుదైన సందర్భం. కేంద్ర మంత్రిగా దేశానికి ఆయన ఎంతో సేవ చేశారు. ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన విజయవంతం అయినందుకు ఎవరినైనా అభినందించాలంటే, అది ఒక్క వెంకయ్యను మాత్రమే! ఆయన తెలుగులో మాట్లాడితే సూపర్‌ఫాస్ట్‌గా ఉంటుందని, ఇన్నాళ్లు మాలో న్యాయవాదిలా కలిసుండి, ఇప్పుడు న్యాయమూర్తిలా చైర్మన్‌ స్థానంలో కూర్చున్నారు’ అని వ్యాఖ్యానించారు.

 

Advertisement
Advertisement