Sakshi News home page

ప్రపంచంలోనే ఈ థియేటర్లు చాలా స్పెషల్..

Published Thu, Mar 23 2017 10:53 PM

ప్రపంచంలోనే ఈ థియేటర్లు చాలా స్పెషల్..

ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే మంచి సినిమా ఒక్కటే చాలదు. థియేటర్‌లో సీటింగ్, సౌండ్‌ క్వాలిటీ, సిబ్బంది పనితీరు వంటివన్నీ బావుంటూ, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలి. అందుకే థియేటర్లలో అధునాతన విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. సినిమాతోపాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తూ, వాటిని అమలు చేస్తున్నారు. దీంతో రెగ్యులర్‌ థియేటర్లకు భిన్నమైన సినిమా హాళ్లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. వాటిల్లోంచి కొన్ని అరుదైన సినిమా హాళ్ల గురించి తెలుసుకుందాం..

ఆర్ట్‌హౌజ్‌ థియేటర్‌..
థియేటర్లను కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తుంటాయి. కానీ కొన్ని థియేటర్లు మాత్రమే తమ ప్రత్యేకతను చాటుకుంటాయి. అలాంటివాటిలో ఐర్లాండ్‌లోని లైట్‌హౌజ్‌ సినిమా ఒకటి. రాజధాని డబ్లిన్‌ నగరంలోని స్మిత్‌ఫీల్డ్‌లో ఉన్న లైట్‌హౌజ్‌ కళాత్మకంగా ఉంటుంది. అందుకే దీన్ని ఆర్ట్‌హౌజ్‌ థియేటర్‌ అని కూడా అంటారు. థియేటర్లోని ప్రతి సీటూ వైవిధ్యమైన రంగులో ఉంటుంది. సీట్లు, ఫ్లోరింగ్‌ అంతా వేర్వేరు రంగుల్లో ఉంటూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 1988 నుంచి ఈ థియేటర్లో ఐరిష్, ఇండిపెండెంట్, విదేశీ క్లాసిక్‌ చిత్రాలను ప్రదర్శించేవారు. 1996లో దీన్ని మూసివేశారు. అనంతరం 2012లో దీన్ని పునఃప్రారంభించారు. అప్పటినుంచి ఈ థియేటర్‌ ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకుం టోంది. ఈ రకమైన థియేటర్లు అక్కడ నాలుగు ఉన్నాయి.

కిడ్స్‌ ఫ్రెండ్లీ థియేటర్‌..
సినిమాలంటే చిన్న పిల్లలకు అంత ఆసక్తిగా ఉండదు. ఆరు, ఏడేళ్లలోపు పిల్లలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడాన్ని ఆస్వాదించలేరు. పిల్లలకు ఆసక్తి లేదు కదా అని పెద్దలు సినిమాకు వెళ్లకుండా ఉండలేరు. తల్లిదండ్రులు తమతోపాటు చిన్నారుల్ని కూడా తీసుకెళ్తారు. కానీ అక్కడ పెద్దలు సినిమా చూస్తుంటే, పిల్లలు మాత్రం అల్లరి చేస్తుంటారు. తల్లిదండ్రుల్ని కూడా సరిగ్గా సినిమా చూడనివ్వరు. అలాగని వారిని బయటికి తీసుకెళ్లలేం. ఈ సమస్యకు పరిష్కారంగా మెక్సికోకు చెందిన సినీ థియేటర్ల నిర్వహణా సంస్థ ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అదే కిడ్స్‌ ఫ్రెండ్లీ థియేటర్‌. సాధారణంగా హాల్‌ లోపల పిల్లలు సినిమా చూస్తే, సీట్లో కామ్‌గా కూర్చోవాల్సిందే. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సినీపోలిస్‌ థియేటర్లో మాత్రం పిల్లలు ఎంచక్కా ఆడుకోవచ్చు. మల్టీప్లెక్సుల్లో గేమింగ్‌ జోన్స్‌ ఉంటాయి కానీ, అవన్నీ థియేటర్‌ బయటి హాల్‌లోనే.

కానీ ఇక్కడ సినిమా హాల్లోనో ప్రత్యేక గేమింగ్‌ జోన్‌లు ఉన్నాయి. అంటే థియేటర్‌లో స్క్రీన్‌కి దగ్గరగా, కొంత ప్రదేశంలో గేమింగ్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. స్లైడ్స్, ప్లే స్ట్రక్చర్స్, జంగిల్‌ జిమ్స్‌ వంటివి ఏర్పాటయ్యాయి. ఇక్కడ పిల్లలు తమకు నచ్చిన ఆట ఆడుకునే వీలుంది. పెద్దలు దూరంగా సినిమా చూస్తుంటే, పిల్లలు ఆడుకోవచ్చు. ప్రస్తుతం క్యాలిఫోర్నియాలో ఇలాంటివి రెండు థియేటర్లు ఉన్నాయి. పన్నెండేళ్లలోపు పిల్లలు ఇక్కడ ఆడుకునేందుకు అనుమతి ఉంటుంది. పెద్దలు సినిమా చూస్తే, చిన్న పిల్లలు ఆటలాడుకుంటూ గడిపేస్తున్నారు. ఈ థియేటర్లకు అక్కడ ఆదరణ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న ఈ విధానం భవిష్యత్‌లో ఇతర దేశాలకూ వ్యాపించే అవకాశం ఉంది.

ఫ్లోటింగ్‌ థియేటర్‌..
థియేటర్లు ఎక్కువగా పెద్ద హాళ్లలోనే నాలుగు గోడల మధ్య ఏర్పాటు చేస్తారు. కొన్ని ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు కూడా ఉంటాయి. అయితే అవన్నీ నగరాలు, పట్టణాలు వంటి జనావాసాల మధ్యే ఉంటాయి. కానీ మలేసియాలో మాత్రం ఓ థియేటర్‌ నదిలోని నీళ్లు,  పర్వతాల మధ్య ఉంది. ఆ థియేటర్‌ పేరు ఆర్కిపెలాగో సినిమా. ఇది కూడా ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లాంటిదే. కాకపోతే నేలపై కాకుండా, నీళ్లపై ఉండడం విశేషం. మలేసియాలోని మలక్కా అనే ప్రాంతంలో ట్రాంక్విల్‌ అనే ఒక చిన్న నది మధ్యలో ఈ థియేటర్‌ ఏర్పాటైంది. నీళ్ల మధ్యలో, రెండు పర్వతాలకు దగ్గరగా పెద్ద తెర ఉంటుంది. దానికి కొద్ది దూరంలో సీటింగ్, ఆ వెనకే ప్రొజెక్టర్‌ ఉంటుంది. కలపతో తీర్చిదిద్దిన తెప్పలపై, చుట్టూ వలలు ఏర్పాటు చేసి ఈ థియేటర్‌ను నిర్వహిస్తున్నారు. 2012లో ప్రారంభమైన ఈ థియేటర్‌లో సినిమా చూడడం ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని అందిస్తుంది. జర్మన్‌కు చెందిన ఓలె షీరెన్‌ అనే ఆర్కిటెక్ట్‌ దీన్ని తీర్చిదిద్దాడు. ఇలా నీటిపై తేలియాడే థియేటర్‌ ప్రపచంలో ఇదొక్కటే.

అతిచిన్న థియేటర్‌..
చిన్న మల్టీప్లెక్స్‌ అయినా సరే కనీసం వంద మందికి పైగా కూర్చుని సినిమా చూసే వీలుంటుంది. ఇక పెద్ద హాళ్లల్లో అయితే వందల సంఖ్యలోనే ప్రేక్షకులు ఉంటారు. మరి ఎనిమిది సీట్లు మాత్రమే ఉండే థియేటర్‌ గురించి తెలుసా..? అదే బ్రిటన్‌కు చెందిన సోల్‌ సినిమా. ఇదో మొబైల్‌ థియేటర్‌. 1965లో ముర్రిస్‌ మైనర్‌ అనే ఓ క్యాంపర్, చిన్న క్యారవాన్‌లో ఈ థియేటర్‌ను ఏర్పాటు చేశాడు. ఆటోకంటే కాస్త పెద్దగా ఉండే ఈ థియేటర్‌లో ఎనిమిది మంది ప్రేక్షకులు మాత్రమే కూర్చోవచ్చు. ఈ థియేటర్‌ ఏడు అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. దీంతో సోల్‌ సినిమాకి ప్రపంచలోనే అతి చిన్న థియేటర్‌గా గుర్తింపు దక్కింది. చిన్నగా ఉంటుంది కదా అని ఇందులో టీవీ ఉంటుందనుకోవద్దు. అన్ని సినిమా హాళ్లలో ఉండేలాంటి తెర, ప్రొజెక్టర్‌ ఉంటాయి. ఇక ఇంటర్వెల్‌ బయట పాప్‌కార్న్, కూల్‌డ్రింకులు సైతం అందుబాటులో ఉంటాయి. పైగా ఇది పూర్తిగా సౌరశక్తిపై ఆధారపడి పనిచేస్తుంది. తెర చిన్నగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
– సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Advertisement
Advertisement