తమిళ హీరో విజయ్ కు ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానం! | Sakshi
Sakshi News home page

తమిళ హీరో విజయ్ కు ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానం!

Published Fri, Jan 10 2014 1:14 AM

తమిళ హీరో విజయ్ కు ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానం! - Sakshi

సాక్షి, చెన్నై: ఇళయ దళపతి విజయ్ తమ పార్టీలోకి రావాలంటూ ఆప్ ఆహ్వానం పలికింది. దీంతో విజయ్ రాజకీయ అరంగేట్రంపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. సినీ వినీలాకాశంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి అభిమాన లోకాన్ని కల్గిన హీరోలు ఇళయ దళపతి విజయ్, అజిత్. వీరిలో ఇళయ దళపతి పేరు రాజకీయ చర్చల్లో నానుతూ ఉంటుంది. ఆయన తండ్రి, దర్శక, నిర్మాత ఎస్‌ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నా యి. తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారు. విజయ్ అభిమాన సంఘాల ద్వారా సేవల్ని విస్తృత పరుస్తున్నారు. దీంతో విజయ్ రాజకీయ అరంగేట్రం తర చూ వార్తల్లోకి వస్తుంటుంది. 
 
 అభిమాను లు రెట్టింపు ఉత్సాహంతో రాజకీయాల్లోకి 
 రావాల్సిందేనని పట్టుబడుతూ జెండాలు చేతపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన మద్దతును అన్నాడీఎంకేకు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలు విజయ్ నటించిన తలైవా చిత్రం చిక్కుల్లో పడేలా చేశాయి. దీంతో తలైవా రాజకీయాల్లోకి రా..! అంటూ అభిమానులు జెండా పట్టడం, చివరకు బుజ్జగింపులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఆయన నటించిన జిల్లా చిత్రం భారీ అంచనాలతో శుక్రవారం తెరపైకి రానుంది. ఈ పరిస్థితుల్లో విజయ్ రాజకీయ చర్చ మళ్లీ తెరపైకి వస్తోంది. ఇందుకు కారణం ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ఆహ్వానం పలకడమే. 
 
 బలోపేతం కోసం...: అవినీతి నిర్మూలన లక్ష్యంగా చీపురు చేత బట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి, దేశ వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ఆ పార్టీ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతున్నది. ఈ సమయంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆప్ నేత పంకజ్ గుప్తా తమ పార్టీలోకి రావాలంటూ విజయక్ పరోక్ష ఆహ్వానం పలికారు. ఆప్‌కు విజయ్ అభినందనలు తెలియజేసినట్టుగా ఉందే అని మీడియా వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన పంకజ్ ఈ ఆహ్వానం పలికారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వాళ్లందరూ తమ పార్టీలోకి రావచ్చని, విజయ్ వస్తే ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ వార్తను కాస్త తమిళ మీడియా హైలెట్ చేయడంతో విజయ్ రాజకీయ అరంగేట్రం చర్చ మళ్లీ తెరమీదకు వచ్చింది. కొత్త చిత్రం విడుదల వేళ ఈ రాజకీయ ఆహ్వానం రావడంతో అభిమానులు మరింతగా ఉవ్విళ్లూరుతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న జిల్లా బాక్సాఫీసు బద్దలు కొట్టిన పక్షంలో అభిమానుల నుంచి ఒత్తిడి పెరగడం మాత్రం తథ్యం. 

Advertisement
Advertisement