డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే.. ఈ ప్రమాదం | Sakshi
Sakshi News home page

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే.. ఈ ప్రమాదం

Published Thu, Oct 31 2013 3:43 AM

Volvo bus catches fire accident by due to negligence of driver

వనపర్తి, న్యూస్‌లైన్: బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టు డీఐజీ నవీన్‌చంద్ వెల్లడించారు. ఘటనా స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ప్రమాదంలో 45 మంది దుర్మరణం పాలవగా ఐదుగురు ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు కొత్తకోట దాటగానే పాలెం సాయి దాబా వద్ద రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. దాంతో బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లో వ్యాపించడంతో ప్రయాణికులు నిస్సహాయంగా సజీవ దహనమయ్యారు’’ అని వివరించారు. ‘‘దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాం.
 
 ఇంతటి ప్రాణనష్టానికి కారణమైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం. అతన్ని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడతాం. ఘటనపై ఐపీసీ 337, 338, 309, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయాయన్నారు. ముగ్గురి శవాలను మాత్రం వారి బంధువులు గుర్తించడంతో పోస్టుమార్టం అనంతరం వారికప్పగించామని తెలిపారు. బస్సుకు దివాకర్ రోడ్‌లైన్స్ పేర అనుమతి ఉందని, నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బెంగళూరు నుంచి బయల్దేరినప్పుడు బస్సులో 37 మంది పేర్లు మాత్రమే నమోదై ఉన్నాయని, మధ్యలో అక్కడక్కడ ఎక్కిన వారి వివరాలు తెలియరాలేదని అన్నారు. మృతుల కుటుంబీకులు తమవారి వివరాల కోసం జిల్లా ఎస్పీ, ఓఎస్డీలను సంప్రదించాలని సూచించారు.
 
 ఏ మాంసపు ముద్ద ఎవరిదో?
 ప్రమాదం గురించి తెలిసి హుటాహుటిన తరలివచ్చిన మృతుల బంధువుల రోదనలతో ఘటనా స్థలి శోకసంద్రమైంది. గుర్తించలేనంతగా కాలిపోయిన శవాల ముద్దలను చూసి వారంతా గుండెలవిసేలా రోదించారు. ప్రయాణికుల బంధువుల్లో పలువురు హైదరాబాద్ లక్డీకపూల్ చౌరస్తాలోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సరైన సమాచారం లభించక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం అర్థమైన వారు ట్రావెల్స్ ముందే కుప్పకూలారు. వారి రోదనలు, పెడబొబ్బలతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement