నోటీసులివ్వకుండానే ఓట్లు తీసేశారు | Sakshi
Sakshi News home page

నోటీసులివ్వకుండానే ఓట్లు తీసేశారు

Published Mon, Nov 2 2015 1:56 AM

నోటీసులివ్వకుండానే ఓట్లు తీసేశారు - Sakshi

కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ

తప్పులతడకగా మారిన గ్రేటర్ ఓటర్ల జాబితా
*  మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దంపతుల ఓట్లు గల్లంతు
*  పలుచోట్ల కేంద్ర ఎన్నికల సంఘం బృందాల పర్యటన
ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో ఓటర్ల జాబితాలపై సమీక్ష
జీహెచ్‌ఎంసీ సమర్పించిన నివేదిక పట్ల ఈసీ అసంతృప్తి
*  సమాచారం సరిచేసి ఇవ్వాలని భన్వర్‌లాల్‌కు సూచన
 
 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల పరిధిలో ఓటర్లకు నోటీసులివ్వకుండానే ఏకపక్షంగా ఓట్లు తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలు సైతం తప్పుల తడకగా మారాయన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై పలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుండటంతో దుమారం రేగుతోంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం పరిధిలో ఓటు హక్కు కలిగి ఉన్న మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి దంపతులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే అధికారులు ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం ఓటర్ల జాబితాల్లోని అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఓట్ల తొలగింపు, తప్పుల తడక జాబితాలపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈసీ బృందాలు రంగంలోకి దిగాయి. ఆదివారం నగరంలోని పలు నియోజకవర్గాల్లో ఈ బృందాలు సుడిగాలి పర్యటన చేయడమే కాక.. ఓటర్ల నుంచి నేరుగా అభ్యంతరాలను స్వీకరించాయి. ఉప్పల్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలోని పలు బూత్‌లను పరిశీలించి.. ఓటర్ల జాబితాలు, కొత్త ఓటర్ల నమోదు, ఆధార్ అనుసంధానం వంటి అంశాలను పరిశీలించాయి. జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ సంస్థలో ఓటర్ల జాబితాలపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి సునీల్‌గుప్తా ఆధ్వర్యంలో నగరానికి వచ్చిన అధికారుల బృందం ఈ పరిశీలన చేపట్టింది. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి జీహెచ్‌ఎంసీ సమర్పించిన నివేదికల పట్ల ఈసీ బృందం తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సమాచారాన్ని సరిచేసి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్‌కు సూచించారు. ప్రధానంగా ఎక్కువగా ఓట్లను తొలగించినట్లు ఆరోపణలు వచ్చిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్‌గూడ డివిజన్ కృష్ణానగర్‌లో 14 మంది అధికారులు బృందాలుగా విడిపోయి ఫిర్యాదులను పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. ఈసీ బృందం వచ్చినట్టు తెలియడంతో పలువురు ఓటర్లు వారి వద్దకు వచ్చి తమ ఓట్లు ఉన్నాయా లేదా తెలపాలని మొరపెట్టుకున్నారు. సుమారు రెండు గంటలపాటు అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ తనిఖీలు చేశారు.

 ఉప్పల్‌లోనూ..
 ఓటు వేసేందుకు అర్హత ఉన్న ప్రతి పౌరునికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపడుతుందని ఎలక్షన్ అడిట్ ప్రత్యేక బృందం తెలిపింది. ఆదివారం ముగ్గురు సభ్యులున్న అధికారుల బృందం ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించింది. నియోజకవర్గం పరిధిలోని పది పోలింగ్ బూత్‌లను నేరుగా సందర్శించి వివరాలు రాబట్టింది. ఓట్లను ఎందుకు తొలగించారో బూత్ లెవెల్ ఆఫీసర్ల నుంచి వివరాలను సేకరించింది. అధికారుల ప్రశ్నలకు బీఎల్‌వోలు సరైన సమాధానం చెప్పడంతో వారు సంతృప్తి చెందారు. ఫీల్డ్‌లో వస్తున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామంతాపూర్‌లో అన్ని పోలింగ్ బూత్‌లను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సందర్శించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటుకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ తదితర అంశాలపై ఆరా తీశారు.
 

తప్పుల తడకకు నిదర్శనాలివిగో..
 ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో ఓటరు జాబితా తప్పల తడకగా మారింది. ఉన్న వారి పేర్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టినా అధికారుల తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. నియోజకవర్గంలో 36 వేల ఓట్లు తీసేసినట్లు అధికారులు పేర్కొన్నా ఆ సంఖ్య ఇంకా అధికంగానే ఉంది.
 - ఉదాహరణకు మన్సూరాబాద్ డివిజన్‌లోని బూత్ నెంబర్-136లో అభినయ, తండ్రి భిక్షపతి పేరుతో నాలుగు ఓట్లున్నాయి. దాసరి సుగుణ పేరుతో ఇదే బూత్‌లో 938, 939నెంబర్లలో రెండు ఓట్లు, అభినయ్ వత్సల్ పేరుతో రెండు ఓట్లు ఉండడం గమనార్హం. మరో పోలింగ్ బూత్‌లో భూక్యా కీర్తి పేరుతో రెండు ఓట్లు ఉన్నా ఫొటోలు వేర్వేరుగా ఉన్నాయి.
 - ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో గల 552 బూత్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కిందిస్థాయి సిబ్బంది చేసిన తప్పులకు నిజమైన ఓటర్లు జాబితాలో లేకుండా పోయాయని పలువురు మండిపడ్డారు. ఇలా ఒక్కరిపేరునే నాలుగు, రెండేసి ఓట్లు ఉన్న వాటిని తొలగిస్తే భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
 - ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓట్లు 4,38,900. కానీ జనాభా(2011 సెన్సెస్ ప్రకారం) 4,17,471 మాత్రమే. ఇప్పటివరకు ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని 457 పోలింగ్‌స్టేషన్ల పరిధిలో 49,588 ఓట్లు తొలగించడం గమనార్హం.
 - ఓట్లను తొలగించే విషయంలో అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లకుండా, కనీసం తొలగించే ముందైనా నోటీసులు జారీ చేయకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని అన్ని వర్గాల ఆరోపిస్తున్నాయి.
 - ఓటర్ల జాబితా సవరణపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో జీహెచ్‌ఎంసీ విఫలమైంది. బూత్‌స్థాయి అధికారులు ప్రతి ఆదివారం తమకు కేటాయించిన బూత్‌ల్లో హాజరవకపోవడంతో ఓటర్ల జాబితాలు తప్పుల తడకగా మారాయి.
 

సోమేష్‌కుమార్, భన్వర్‌లాల్‌లను సస్పెండ్ చేయాలి: మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
 గ్రేటర్ పరిధిలో ఏకపక్షంగా ఓట్ల తొలగింపునకు కారకులైన రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్, అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని ఎల్‌బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని రెండు బూతుల్లో టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లు ఉన్న కారణంగా 50 శాతం మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. భవానీనగర్, ద్వారకాపురం, విద్యుత్‌నగర్, మున్సిపల్ కాలనీ, గణేష్‌పురికాలనీల్లో భారీగా ఓట్లు తొలగించినట్లు గుర్తించామని తెలిపారు.

Advertisement
Advertisement