కాని వసూళ్లు.. బాకీలకు నీళ్లు! | Sakshi
Sakshi News home page

కాని వసూళ్లు.. బాకీలకు నీళ్లు!

Published Tue, Aug 27 2013 1:47 AM

కాని వసూళ్లు.. బాకీలకు నీళ్లు!

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ(పీఎస్‌యూ) బ్యాంకులను ఆర్థిక మందగమనం అతలాకుతలం చేస్తోంది. ముక్కుపిండి మరీ రుణ బకాయిలను వసూలు చేయాలంటూ ఆర్థిక శాఖ పదేపదే ఉపదేశిస్తున్నా... ఫలితం మాత్రం కానరావడంలేదు. రికవరీ చేస్తున్న మొత్తంకంటే మాఫీ చేస్తున్నదే రెట్టింపునకు పైగా ఉండటం దీనికి నిదర్శనం. మొత్తం 26 పీఎస్‌యూ బ్యాంకులకుగాను 17 బ్యాంకులది ఇదే పరిస్థితి కావడం గమనార్హం.గత ఆర్థిక సంవత్సరం(2012-13) మార్చితో ముగిసిన ఆఖరి తైమాసికం(క్యూ4)లో మొత్తం 17 పీఎస్‌యూ బ్యాంకుల రుణ రికవరీలు రూ.4,172 కోట్లు మాత్రమే.
 
  ఆర్థిక శాఖ గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. ఇదే కాలంలో ఈ బ్యాంకులు మాఫీ చేసిన రుణాల విలువ రూ.10,787 కోట్లు కావడం మొండి బకాయిల దెబ్బకు తార్కాణంగా నిలుస్తోంది. ఈ జాబితాలో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ సహా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. 2011-12లో మొత్తం 26 పీఎస్‌యూల బ్యాంకుల మాఫీల కంటే ఒక్క గతేడాది క్యూ4లో మాఫీలు నాలుగురెట్లకుపైగా ఉండటం గమనార్హం.  2011-12లో వాస్తవ ప్రభుత్వ బ్యాంకుల వాస్తవ రుణ రికవరీలు రూ.47,800 కోట్లు కాగా... మాఫీల మొత్తం రూ.2,300 కోట్లుగా ఉంది.
 
 చిదంబరం మేల్కొలుపు...
 తాజాగా పీఎస్‌యూ బ్యాంకుల చీఫ్‌లతో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి చిదంబరం మొండిబకాయిల పెరుగుదలను ప్రధానంగా చర్చించారు. మాఫీల మొత్తం పెరిగిపోతుండటం... రికవరీలు నత్తనడకపై ఆర్థిక శాఖ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది కూడా. మొండి బకాయిల(ఎన్‌పీఏలు) సమస్యను పరిష్కరించేందుకు చిదంబరం పలు సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా ఒక ఏడాదిలో బ్యాంకులు తమ మొత్తం రికవరీల కంటే మాఫీలు అధికంగా ఉండకుండా తప్పని సరిగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
 
 లాభాలు ఆవిరి...
 ఏదైనా ఒక ఖాతాదారుడికి ఇచ్చిన రుణాన్ని మాఫీ చేయాలంటే సంబంధిత మొత్తానికి 100% ప్రొవిజనింగ్(బ్యాంక్ తన సొమ్మును పక్కన పెట్టాల్సి ఉంటుంది) కేటాయింపు చేయా ల్సి వస్తుంది. దీనివల్ల బ్యాంకులు తమ స్థూల మొండి బకాయిలు తక్కువగా ఉన్నట్లు ఖాతాల్లో కనబడొచ్చు. అయితే, ప్రొవిజనింగ్‌కు అధిక మొత్తం వెచ్చించడంతో బ్యాంకుల లాభాలు ఆవిరయ్యేందుకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో ఆర్థిక మందగమనం తీవ్రతరం అవడంతో అనేక కంపెనీలు రుణాలు చెల్లించకుండా చేతులెత్తేస్తున్నాయి. ఇటువంటి ఎగవేతల ప్రభావం పీఎస్‌యూ బ్యాంకులపైనే అధికం. మొండిబకాయిలు పేరుకుపోయి... బ్యాంక్ భవిష్యత్తు వృద్ధిపై తీవ్ర ప్రభావానికి దారితీస్తోంది. కావాలనే రుణాలను ఎగవేస్తున్న డిఫాల్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
 
  అటువంటి ఎంటర్‌ప్రెన్యూర్లు/ప్రమోటర్లకు బ్యాంకుల నుంచి ఎలాంటి సహకారం లభించకుండా ఐదేళ్లపాటు నిషేధం విధించడం వంటివి కూడా ఈ సూచనల్లో ఉన్నాయి. భవిష్యత్తులో చేపట్టే కొత్త వెంచర్లు, ప్రాజెక్టులకు ఏ ఆర్థిక సంస్థ/బ్యాంక్ నుంచి రుణాలు లభించకుండా చేయాలని కూడా ఆర్థిక శాఖ పేర్కొంది. అదేవిధంగా రికవరీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిందిగా కూడా సూచించింది. కొత్త/ప్రస్తుత రుణగ్రహీతలకు రుణాల మంజూరు విషయంలో సంబంధిత వివరాలను బ్యాంకులు ఇచ్చిపుచ్చుకోవడం వంటివి చేయాలని పేర్కొంది. మొండి బకాయిల వసూలు/రుణాల రికవరీలకు బ్యాంకులకు చట్టపరంగా మూడు మార్గాలున్నాయి. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్(సర్ఫేసీ) చట్టం-2002 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఇక డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, లోక్ అదాలత్‌లను ఆశ్రయించొచ్చు.
 
 మొండి బకాయిలు పైపైకి...
 ప్రైవేటురంగ బ్యాంకులతో పోలిస్తే పీఎస్‌యూ బ్యాంకుల స్థూల, నికర మొండి బకాయిలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాకుండా రుణాల పునర్‌వ్యవస్థీకరణవల్ల కూడా అధిక ప్రొవిజనింగ్ కేటాయింపు భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి పీఎస్‌యూ బ్యాంకుల మొత్తం స్థూల ఎన్‌పీఏలు వాటి రుణాల్లో 3.78 శాతానికి ఎగబాకాయి. 2011 మార్చి చివరికి ఇవి 2.32 శాతమే. ఇక ఎస్‌బీఐ స్థూల ఎన్‌పీఏలు ఈ ఏడాది మార్చి చివరినాటికి ఏకంగా 5.17 శాతానికి దూసుకెళ్లడం గమనార్హం.
 
 మాఫీల చిట్టా ఇదీ...(రూ.కోట్లలో)
 బ్యాంక్    2012-13 క్యూ4    
     రికవరీ    మాఫీ
 ఎస్‌బీఐ    1,132.00    2,418.00
 బీఓబీ    326.08    1,207.21
 ఐఓబీ    221.49    1,150.50
 బీఓఐ    230.81    1,286.19
 పీఎన్‌బీ    442.38    906.88
 యునెటైడ్ బ్యాంక్    130.00    786.00
 అలహాబాద్ బ్యాంక్    137.41    520.85
 యూకో బ్యాంక్    360.68    447.32
 విజయా బ్యాంక్    67.79    323.86
 ఐడీబీఐ బ్యాంక్    217.88    371.46
 సిండికేట్ బ్యాంక్    251.43    340.03
 ఓబీసీ    211.13    297.94
 ఎస్‌బీఎం    82.86    172.47
 ఇండియన్ బ్యాంక్    109.23    170.42
 బీఓఎం    123.84    170.34
 దేనా బ్యాంక్    84.68    122.92
 కార్పొరేషన్ బ్యాంక్    41.87    94.46
 మొత్తం    4,171.56    10,786.85
 

Advertisement
Advertisement