నేటి మధ్యాహ్నం తీరం దాటనున్న వార్దా | Sakshi
Sakshi News home page

నేటి మధ్యాహ్నం తీరం దాటనున్న వార్దా

Published Mon, Dec 12 2016 3:53 AM

నేటి మధ్యాహ్నం తీరం దాటనున్న వార్దా - Sakshi

విజయవాడ: వార్దా అతి తీవ్ర తుపానుగా కొనసాగుతూ పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న ఈ అతి తీవ్ర తుపాను పశ్చిమ దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆదివారం రాత్రికి ఇది తూర్పు ఈశాన్య దిశగా చెన్నైకి 300, నెల్లూరుకు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ క్రమేపీ తుపానుగా బలహీనపడుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల తీరాల మధ్య చెన్నైకి సమీపంలో సోమవారం మధ్యాహ్నానికి తీరాన్ని దాటనుంది.

ఆ సమయంలో గంటకు 100 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. దీని ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది.  (తీవ్ర పెను తుపానుగా ‘వార్దా’)


వార్దా తుపానును ఎదుర్కొనేందుకు సమాయత్తమైన అధికార యంత్రాంగం.. పలు జిల్లాల్లో తీరప్రాంత ప్రజలను సహాయపునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. ఒక్క నెల్లూరు జిల్లాల్లోనే 150 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయడం గమనార్హం. విజయవాడలోని కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి వార్దా తుపాను తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రకాశం జిల్లాలో ముఖేష్ కుమార్ మీనా, నెల్లూరుకు బి.శ్రీధర్, చిత్తూరుకు రవిచంద్ర, వైఎస్సార్ జిల్లాకు రామ్ గోపాల్ ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు.

చెన్నై గడగడ
గత ఏడాది సంభవించిన వరదలతో అతలాకుతలమైన తమిళనాడు రాజధాని నగరాన్ని తాజాగా వార్దా పెనుతుపాను వణికిస్తోంది. వార్దా ప్రభావం ఎక్కువగా తమిళనాడుపైనే ఉండనుండటంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు భారత నౌకా దళం కూడా వార్దాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. సుమారు 5 వేల మందికి సరిపడా ఆహార పదార్థాలను సిద్ధం చేసింది. వరదలో చిక్కుకుపోయేవారిని రబ్బరు బోట్ల ద్వారా రక్షించేందుకు 30 ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. వార్దా తీవ్రత దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది.
ఆయా జిల్లాల్లో వార్దా ప్రభావానికి సంబంధించిన కథనాలివి..

నెల్లూరు: జిల్లాలో అప్రమత్తత
తూర్పుగోదావరి:  ‘వార్దా’వరణం
పశ్చిమగోదావరి:  తరుముకొస్తున్న వార్దా
గుంటూరు: హార్బర్‌లో మూడో నంబర్‌ ప్రమాద సూచిక

Advertisement
Advertisement