స్వాప్నికుల్లో డీఏసీఏ గుబులు

7 Sep, 2017 01:58 IST|Sakshi
స్వాప్నికుల్లో డీఏసీఏ గుబులు

భారతీయులు 20 వేల మంది ఉన్నట్లు తాజా అంచనా
♦  ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్న దిగ్గజ టెక్‌ కంపెనీలు


వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన డీఏసీఏ (బాల్యంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా) కార్యక్రమాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ రద్దు చేయడంతో అనేకమంది ‘స్వాప్నికులు’ తమను దేశం నుంచి పంపించేస్తారని ఆందోళన చెందుతున్నారు. చిన్నప్పుడే తల్లిదండ్రులతోబాటు అమెరికా వచ్చి, అక్కడ నివసించడానికి చట్టపరంగా ఏ అనుమతులూ లేకుండా అక్రమంగా ఉంటున్న వారిని స్వాప్నికులు (డ్రీమర్లు) అని పిలుస్తారు. అమెరికాలో ఉంటున్న భారత్‌కు చెందిన స్వాప్నికుల సంఖ్య 20 వేలకుపైగానే ఉంటుందని తాజా సమాచారం..

  ఏ పాపం తెలీకుండా, తమ ప్రమేయమే లేకుండా ఇక్కడకు వచ్చి చిన్నప్పటి నుంచి అమెరికాలోనే ఉంటూ సొంత దేశం గురించి, కనీసం అక్కడి స్థానిక భాష కూడా తెలియని వారిని వెనక్కు పంపించడం భావ్యం కాదని  దక్షిణాసియా అమెరికన్ల కోసం పనిచేసే ఓ సంస్థ అధికారిణి సుమన్‌ రఘునాథన్‌ అన్నారు. స్వాప్నికుల ప్రయోజనాలను కాపాడేందుకు అమెరికా కాంగ్రెస్‌ వెంటనే స్పందిచాలని సుమన్‌ కోరారు. ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కూడా అమెరికాలో పలుచోట్ల నిరసనలు జరిగాయి.

పోరాటానికి సిద్ధం: టెక్‌ కంపెనీలు
డీఏసీఏను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ సహా ప్రముఖ టెక్నాలజీ సంస్థలు ప్రకటించాయి. ఆయా కంపెనీల్లో పనిచేస్తూ డీఏసీఏ కింద ఆశ్రయం పొందుతున్న వారికి బాసటగా నిలిచాయి. ట్రంప్‌ నిర్ణయాన్ని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఖండించారు. యాపిల్‌లో పనిచేస్తూ.. ట్రంప్‌ నిర్ణయం వల్ల ప్రభావితులయ్యే వారికి పూర్తి మద్దతుగా నిలుస్తామంటూ ఆయన ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. ‘స్వాప్నికులు మన దేశానికి, సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. 8 లక్షల మంది స్వాప్నికుల హక్కులను కాపాడటం అనివార్యం’ అని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. ‘స్వాప్నికులు మన ఇరుగుపొరుగువారు. మన స్నేహితులు. మన సహోద్యోగులు. ఇదే వారి ఇల్లు.’ అని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌ చేశారు. డీఏసీఏ కార్యక్రమాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలంతా కాంగ్రెస్‌ను కోరాలని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పిలుపునిచ్చారు. స్వాప్నికులపై చర్యలు అమెరికా విలువలకు విరుద్ధమని ఉబర్‌ సీఈవో అన్నారు.

>
మరిన్ని వార్తలు