రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు.. జాతీయ పార్టీల మద్దతు కూడగడతాం: మైసూరారెడ్డి | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు.. జాతీయ పార్టీల మద్దతు కూడగడతాం: మైసూరారెడ్డి

Published Sat, Nov 16 2013 2:16 AM

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు.. జాతీయ పార్టీల మద్దతు కూడగడతాం:  మైసూరారెడ్డి - Sakshi

* వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి ఉద్ఘాటన
* మద్దతు కూడగట్టేందుకు జగన్‌తోపాటు ఢిల్లీకి ఐదుగురు నేతల ప్రతినిధి బృందం
* నేడు సీపీఎం, సీపీఐలతో, రేపు బీజేపీతో భేటీ
* కోర్టు అనుమతి లభిస్తే ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటన
* ఆర్టికల్ 3ను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది
 
 సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రాల విభజన విషయంలో ఎలాంటి విధానం పాటించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యకు నిరసనగా, సమైక్య రాష్ట్రానికి జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం ఢిల్లీ వెళుతున్నట్లు చెప్పారు. ఈ బృందం శనివారం సీపీఎం, సీపీఐలతోను, ఆదివారం బీజేపీ నేతలతోను భేటీ అవుతున్నట్లు వెల్లడించారు.
 
  పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మైసూరారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌కు కోర్టు అనుమతి లభిస్తే ఇతర రాష్ట్రాల రాజధానులకు కూడా వెళ్లి వారి మద్దతు కూడగడతామని, ఆలోపు ఢిల్లీలో ఉన్న పార్టీల నేతలందరినీ కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడిన పరిస్థితి భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా వచ్చే ప్రమాదముందని ఢిల్లీ పర్యటనలో జాతీయ పార్టీలకు నచ్చచెబుతామన్నారు. ఆర్టికల్ 3 సవరణ దిశగా పోరాడాల్సిందిగా అన్ని పార్టీలకు విన్నవిస్తామన్నారు. ఈ పర్యటనలో జగన్‌తోపాటు తాను, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, వి.బాలశౌరి, గట్టు రామచంద్రరావు పాల్గొంటారని తెలిపారు.
 
 ఒక్క ఆంధ్రప్రదేశ్‌నే ఎందుకు విభజిస్తున్నారు?
 విభజనకు సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల నుంచి కేంద్రం వద్ద విజ్ఞప్తులు ఉన్నాయని మైసూరా చెప్పారు. ఉత్తరప్రదేశ్, విదర్భలు అయితే ఏకంగా అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపించినప్పటికీ వాటినేవీ పట్టించుకోకుండా కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌నే విభజిస్తామంటూ ఆగమేఘాల మీద కసరత్తు చేయడంలో ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఆయా రాష్ట్రాల్లో వారు బలహీనంగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా అడ్డగోలు విభజనను అనుసరించే ప్రమాదముందన్నారు. ఇదే విషయాన్ని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలకు వివరిస్తామన్నారు. ప్రజాస్వామ్యంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని కాంగ్రెస్ పార్టీని కలిసేదిలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా చెప్పారు.
 
 దేశ సమగ్రత కోసం ఆర్టికల్ 3ను పెడితే..
 కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 దుర్వినియోగమవుతోందని మైసూరా విమర్శించారు. దానికి సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 3కు ఉన్న ప్రాధాన్యతను మైసూరా వివరించారు. ‘దేశంలో అప్పట్లో సంస్థానాలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రాలు ఉండేవి. అందుకే దేశం సమగ్రంగా ఉండాలని ఆర్టికల్ 3ను రూపొందించారు. ఎస్సార్సీ వేసిన తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయి. అందులో భాగంగానే మన రాష్ట్రం ఏర్పడింది. ఇటువంటి నేపథ్యం ఉన్న వాటిని కేంద్రం తన సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోంది. ఇలాగే వ్యవహరిస్తే దేశ సమగ్రతకే భంగం వాటిల్లే ప్రమాదముంది’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో కూడా  వైఎస్ జగన్ నేతృత్వంలో జాతీయ పార్టీలను కలిసి మద్దతు కూడగట్టనున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement