సమ్మెపై వెనక్కి తగ్గం | Sakshi
Sakshi News home page

సమ్మెపై వెనక్కి తగ్గం

Published Tue, Aug 13 2013 5:44 AM

we won't take back strike, Seemandhra employee committee rejected

సాక్షి, హైదరాబాద్: సమ్మె నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం చేసిన విజ్ఞప్తిని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, రఘువీరారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కూడిన ఉపసంఘం సోమవారం ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బృందంతో సమావేశమైంది. ఉపసంఘంలో సభ్యుడైన కొండ్రు మురళి సమావేశానికి హాజరుకాలేదు. ఈ భేటీ వివరాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వేర్వేరుగా విలేకరులకు వెల్లడించారు. వారు చెప్పిన వివరాల మేరకు సమావేశంలో ఏం జరిగిందంటే..
 
 మంత్రులు: సమ్మె వల్ల పౌర సేవలకు విఘాతం కలుగుతుంది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. సమ్మె నిర్ణయం విషయంలో పునరాలోచన చేయండి. ఉద్యోగులు: ఇది ఏ ఒక్కరి నిర్ణయం కాదు. దాదాపు 70 సంఘాలు సమావేశమై.. విభజనకు వ్యతిరేకంగా సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేం. ఈరోజు(సోమవారం) అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుంది.  మంత్రులు: డిమాండ్ల సాధనలో చివరి అస్త్రంగానే నిరవధిక సమ్మెను వాడాలి. కానీ మీరు ముందునుంచే నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందాం.
 ఉద్యోగులు: ఉద్యోగుల సర్వీసు, జీత భత్యాలకు సంబంధించిన అంశాల్లో మీరు చెప్పిన విధానం అనుసరించాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి నిరవధిక సమ్మె మినహా మాకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు.
 మంత్రులు: విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్రం ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీని నివేదిక సమర్పించడానికి తగిన ఏర్పాట్లు చేస్తాం. నివేదిక ఇచ్చిన తర్వాత కమిటీ స్పందన తెలుసుకొనే వరకు సమ్మెను వాయిదా వేయండి.
 ఉద్యోగులు: అది పార్టీ కమిటీ. ఆంటోనీ కమిటీ పరిధి, అధికారం, దానికున్న చట్టబద్ధత ఏమిటో ఇప్పటి వరకు తెలియదు. ఈ విషయాల్లో స్పష్టత వచ్చిన తర్వాత నివేదిక ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటాం. కమిటీకి నివేదిక ఇచ్చే పేరిట సమ్మెను వాయిదా వేయలేం.
 మంత్రులు: కమిటీలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఎంపీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు.  వారంతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగలిగినవారు. విభజన ప్రక్రియలోనూ వారి మాటకు విలువ ఉంటుంది. అనుమానాలు అక్కర్లేదు.
నివేదిక ఇవ్వండి.

 

ఉద్యోగులు: కమిటీ విధివిధానాలు, చట్టబద్ధత గురించి స్పష్టత వచ్చిన తర్వాత ఆ విషయం చర్చించుకుందాం.
 మంత్రులు: మీ ఉద్యోగాలకు, మీ భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే.
 ఉద్యోగులు: హైదరాబాద్‌లోని శాఖాధిపతుల కార్యాలయాల్లో గేట్ మీటింగ్స్ పెట్టుకోవడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. కార్యాలయాల్లో పెద్ద సంఖ్యలో బలగాలు మోహరించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేసుకొనే హక్కు కూడా మాకు లేదా? విభజన తర్వాత మా భద్రత గురించి మాట్లాడుతున్నారు.. ఇప్పుడే నిరసన వ్యక్తం చేయలేని పరిస్థితులు ఉంటే అప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
 మంత్రులు: మీరు నిరసన ప్రదర్శనలు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
 ఉద్యోగులు: హామీని నిలబెట్టుకోండి.
 మంత్రులు: ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కరించుకోగలం. మంత్రివర్గ ఉపసంఘం తలుపులు తెరిచే ఉంటాయి.
 ఉద్యోగులు: అలాగే సర్.

Advertisement
Advertisement