రుణాల మాఫీతో ఒరిగేదేమిటి? | Sakshi
Sakshi News home page

రైతుల ఆత్మహత్యలు తగ్గాయా?

Published Tue, Jun 20 2017 6:14 PM

రుణాల మాఫీతో ఒరిగేదేమిటి? - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రైతుల రుణాలను మాఫీ చేయడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని, కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రైతుల రుణాలను మాఫీ చేయబోదని, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మాఫీలను భర్తీ చేయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం స్పష్టం చేశారు. ఆర్థిక లక్ష్యాల సాధనకు రుణాల మాఫీ అవరోధం అవుతుందని అన్నారు. రైతుల రుణాలను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు ఇప్పటికే మాఫీ చేయడం, రుణాలను మాఫీ చేస్తున్నట్టు పంజాబ్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించడం, రుణాలను మాఫీ చేయాలంటూ తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అరుణ్‌ జైట్లీ ఈ వివరణ ఇచ్చారు.

దేశంలో వ్యవసాయ సంక్షోభానికి రైతుల రుణాలే కారణమా, రుణాలను మాఫీ చేసినట్లయితే సంక్షోభ పరిస్థితులు చక్కబడతాయా? రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయా? రుణాల మాఫీ చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంత భారం పడుతుందీ? ఆర్థిక భారం మోయలేమంటున్న అరుణ్‌ జైట్లో మాటల్లో అర్థమేమైనా ఉందా? ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 36,359 కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసింది. మహారాష్ట్ర 30,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. ఇప్పుడు పంజాబ్‌ 36,600 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయబోతోంది. దీంతో రైతుల రుణాల మాఫీ లక్ష కోట్ల రూపాయలను దాటిపోయింది. మిగతా ఐదు రాష్ట్రాల్లో కూడా రుణాలను మాఫీ చేసినట్లయితే రుణాల మాఫీ మొత్తం 3.1 ల„ý ల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది.

ఈ మొత్తం జాతీయ స్థూల ఉత్పత్తిలో 2.6 శాతం.
ఈ రుణాల మాఫీ మొత్తంతో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను 16 సార్లు వేయవచ్చని లేదా వ్యవసాయ పంటల నిల్వ కోసం 4,43,000 గిడ్డంగులను నిర్మించవచ్చని లేదా 55 శాతం వ్యవసాయ ఉత్పత్తులను పెంచవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2017, మార్చి నెల నాటికి గత తొమ్మిదేళ్లకాలంలో దాదాపు ఐదు కోట్ల మంది రైతులకు 88,988 కోట్ల రూపాయలను మాఫీ చేసింది. రైతుల ఆత్మహత్యలు చేసుకోకుండా నిలువరించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను రుణాలను మాఫీ చేస్తున్నాయి.

రైతుల ఆత్మహత్యలు తగ్గాయా?
రైతుల రుణాల మాఫీ కారణంగా రైతులు ఆత్మహత్యలు తగ్గలేదు. దేశంలోని రైతుల్లో మూడు, నాలుగు ఎకరాలు కలిగిన చిన్న, మధ్యకారు రైతులు 3.28 కోట్ల మంది ఉన్నారు. వారిలో 1.60 కోట్ల మంది రైతులు మాత్రమే బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు. దాదాపు రెండు కోట్ల మంది రైతులు, వడ్డీవ్యాపారుల దగ్గర, ఇతరుల వద్ద అప్పులు తీసుకుంటున్నారు. ఆ అప్పులు తీర్చలేక, అవమానాలు భరించలేకనే ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు రుణాల మాఫీ చేస్తూ పోవడం వల్ల బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి. రుణాలు మాఫీ చేస్తున్న రాష్ట్రాల్లో వీటివల్ల ద్రవ్యలోటు మూడు శాతం మించి పోతుంది. మూడు శాతం మించరాదన్నది 14వ ఆర్థిక కమిషన్‌ విధించిన పరిమితి.

వ్యవసాయ సంక్షోభానికి కారణాలు
టూకీగా చెప్పాలంటే వ్యవసాయ రంగంలో ప్రతిష్టంభన ఏర్పడడం. ప్రణాళికాబద్ద వ్యవసాయం లేకపోవడం వల్ల డిమాండ్‌కు, సరఫరాకు మధ్య వ్యత్యాసం పెరిగిపోవడం. ఉత్పత్తి పెరిగి రైతులకు గిట్టుబాటు ధర పడిపోవడం, ఉత్పత్తుల నిల్వలకు అవసరమైనన్ని శీతల గిడ్డంగిలు లేకపోవడం, లోపభూయిష్టమైన మార్కెట్‌ వ్యవస్థ, సంస్థాగత లోపాలు కారణాలు. రుణాల మాఫీ సొమ్ముతో ఈ లోపాలన్నింటిని అరికట్టవచ్చని వ్యవసాయ నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement