ఇదీ వివాదం | Sakshi
Sakshi News home page

ఇదీ వివాదం

Published Sat, May 16 2015 2:02 AM

ఇదీ వివాదం

భారత చైనాల మధ్య ప్రధానంగా నలుగుతున్న సమస్య సరిహద్దు సమస్యే.. ఉత్తర, ఈశాన్య భారతానికి ఎగువన దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల మేర భూభాగం రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకూ పలు సార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఇంతకాలం వివాదగ్రస్తమైన భూభాగంపై ఎవరి పట్టుదలలు వారు కొనసాగించటంతో సమస్య ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. ప్రస్తుతం రెండు దేశాలూ విభేదాలున్నట్లు  అంగీకరించటం మంచి పరిణామం. ఈ అంశానికి వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుగొనాలని ప్రధాని మోదీ బీజింగ్‌లో శుక్రవారం స్పష్టంగా ప్రకటించారు. భారత్ చైనాల  మధ్య స్పష్టమైన సరిహద్దులు ఇప్పటి వరకూ లేవు. 1962లో చైనా భారత్‌తో ప్రారంభించిన యుద్ధాన్ని ఎక్కడైతే ముగించిందో, దాన్నే వాస్తవాధీన రేఖగా ఇప్పటి వరకూ పరిగణిస్తున్నారు. సరిహద్దు వివాదం వివరాలు ఇవీ.

 మెక్‌మోహన్‌లైన్: భారత స్వాతంత్య్రానికి ముందే టిబెట్ సరిహద్దులపై మొదలైన వివాదంపై 1914లో సిమ్లాలో భారత్(నాటి బ్రిటన్ సర్కారు), చైనా, టిబెట్ల మధ్య చర్చలు జరిగాయి.  బ్రిటిష్ సర్కారు తరపున హెన్రీ మెక్‌మోహన్  ప్రాతినిథ్యం వహించారు. భారత్‌కు తూర్పున సరిహద్దును గుర్తిస్తూ మ్యాప్‌ను రూపొందించి దాని ఆధారంగా ఒప్పందం చేసుకున్నారు. ఈ సరిహద్దునే మెక్‌మోహన్ లైన్ అని పిలుస్తున్నారు. ముసాయిదా ఒప్పందానికి మొదట చైనా అంగీకరించినా తుది ఒప్పందానికి నిరాకరించటంతో మెక్‌మోహన్‌లైన్ కాగితాలకే పరిమితమైపోయింది.

 అక్సాయ్‌చిన్: జమ్మూకశ్మీర్‌లోని దాదాపు 38వేల చదరపు కిలోమీటర్ల అక్సాయ్‌చిన్ ప్రాంతం తమదేనన్నది చైనా మరో వాదన. సముద్రమట్టానికి 22, 500 అడుగుల ఎత్తున ఉండే ఈ ప్రాంతం 1865 నాటి జాన్సన్ లేన్ ప్రకారం జమ్మూ కశ్మీర్‌లో భాగంగా ఉంది. జాన్సన్ లేన్‌ను చైనా అంగీకరించలేదు. అక్సాయ్‌చిన్‌ను ఆక్రమించటమే కాకుండా 1950లలో పశ్చిమ ప్రాంతంలో జింగ్‌జియాంగ్ నుంచి టిబెట్ వరకు 1200 కిలోమీటర్ల రహదారిని చైనా నిర్మించింది. 1959లో చైనా తన అధికార మ్యాప్‌లో ప్రకటించేంత వరకూ కూడా భారత్‌కు ఈ రహదారి నిర్మాణం గురించి తెలియలేదు. అక్సాయ్‌చిన్‌లోని ఉత్తర ప్రాంతాలైన షాహిదుల్లా, ఖోటాన్‌లను తన భూభాగాలుగా భారత్ పేర్కొనటం లేదు. ఈశాన్య కారాకోరమ్ పర్వత శ్రేణుల నుంచి తూర్పు కున్‌లున్ పర్వత ప్రాంతం వరకు భారత్ తన భూభాగంగా పేర్కొంటోంది.

 అరుణాచల్‌ప్రదేశ్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లా తమదేనని చైనా వాదిస్తోంది. తూర్పు సరిహద్దుల్లోని బర్హోటీ మైదాన ప్రాంతాలను తనలో కలిపేసుకుంది. ఇప్పటికి పలుమార్లు అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా చొరబాట్లు జరిపింది.
 తూర్పు పశ్చిమ సెక్టార్‌లతో పాటు, హిమాలయ పర్వత శ్రేణుల్లో సుమారు 4వేల చదరపు కిలోమీటర్ల పొడవైన సరిహద్దు సమస్యలు కొలిక్కి రావలసి ఉంది. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్ల తరువాత సమస్యను పరిష్కరించుకోవటంపై ఇరుదేశాల నాయకత్వం నుంచి సానుకూలతలు వ్యక్తమవుతున్నాయి.    - సెంట్రల్ డెస్క్

Advertisement
Advertisement