ఆ మహిళలు.. అసమానతను గెలిచారు..! | Sakshi
Sakshi News home page

ఆ మహిళలు.. అసమానతను గెలిచారు..!

Published Thu, Oct 22 2015 6:26 PM

ఆ మహిళలు.. అసమానతను గెలిచారు..!

వీపుపై వెదురు బుట్టలు కట్టుకొని పచ్చని ప్రకృతి మధ్య టీతోటల్లో ఆకులు తుంచుతూ కనిపించే ఆ మహిళలను చూస్తే మనకు ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ.. కానీ వారి జీవితాల్లో బాధలు ఆగాధాల్లా పేరుకొన్నాయి. వారికి అంతులేని వేదనలు మిగులుస్తున్నాయి. అయితే ఏళ్ళదరబడి  జీవన పోరాటంలో గెలిచేందుకు వారు చేసిన ప్రయత్నం ఇప్పుడు విజయవంతమైంది. టీ తోటల్లో కనిపించని కష్టాలను గట్టెక్కేందుకు నెరపిన ఉద్యమం ఎందరో మహిళలకు స్ఫూర్తి దాయకంగా మారింది. రాజకీయాలకు అతీతంగా, పురుషుల అండదండలు అవసరం లేకుండా యాజమాన్యాలపై పోరాడి  అనుకున్నది సాధించారు. కన్నన్ దేవన్ హిల్స్ టీ తోటల్లోని మహిళలు తమ సత్తా చాటుకున్నారు.

 కేరళరాష్ట్రం మున్నార్ కొండప్రాంతం టీ తోటల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ పనిచేసే మహిళా కూలీల శ్రమను మాత్రం దశాబ్దాలు గడుస్తున్నా గుర్తించేవారే లేకుండా పోయారు. దీంతో మహిళలంతా ఒక్కటయ్యారు. మేం బుట్టలను వీపుపై కట్టుకొని టీ ఆకులు కోస్తాం.. మీరు ఆ బుట్టల్లోంచి డబ్బు దండుకుంటున్నారు.... అంటూ టీ తోటల్లో మొదలైన మహిళల ఉద్యమం రోడ్డుపైకి చేరింది. కనీసం తమ నిరసనల్లో రాజకీయ నాయకులను, పురుషులను అనుమతించలేదు. ఎటువంటి సంఘాలను జోక్యం చేసుకోనివ్వలేదు. యూనియన్ నాయకులు యాజమాన్యాలతో కుమ్మక్కై వారి బోనస్ ను తగ్గించడాన్ని నిరసించారు. నాలుగు నుంచి ఆరువేల మంది మహిళలు తొమ్మిది రోజులపాటు.. యాజమాన్యాలతో  అధిక బోనస్ కోసం పోరాడి చివరికి కేవలం మహిళా శక్తితో గెలుపు సాధించారు.

పార్టీలకు ప్రభావితమైన యూనియన్ లీడర్లు, ఆధిక్యం ప్రదర్శించే పురుషులకు దీటుగా... ఉద్యమించిన మహిళా శక్తి నేడు ఈ ప్రాంతంలోని పలు ఎస్టేట్స్ లోని మహిళా కూలీలకు, ఉద్యోగినులకు స్ఫూర్తిగా మారింది. దీంతో వీరంతా ఇప్పుడు వేతనాలకోసం పోరాటాన్ని ప్రారంభించారు. ఒక్క టీ తోటల్లోనే కాదు వరి చేలల్లోనూ, అగరబత్తి, బీడీ రోలింగ్, రొయ్య పొట్టు, పట్టు పురుగు పెంపకం, జీడి గింజల ఫ్యాక్టరీల్లోనూ ఈ మహిళా గళం ప్రతిధ్వనించింది. ఉద్యోగాల్లోనూ, వృత్తుల్లోనూ మహిళలు సమానంగా పనిచేస్తున్నా పురుషులకంటే తక్కువ వేతనాలు ఇవ్వడం, పురుష ఆధిక్యతతో ఉండటం ఎందుకు జరుగుతోందంటూ వీరు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుత మున్నార్ మహిళల తిరుగుబాటు ఒక్క వారి సమస్యలు సాధించేందుకే కాదు... ఏకంగా భారత ఆర్థిక వ్యవస్థ పైనే పడనుంది. కులం, రంగు, రాజకీయాలు మొదలైన అనేక వివక్షల్లో మార్పును తెచ్చేందుకు, అందరికీ సమన్యాయం జరిగేందుకు ఉపయోగ పడనుంది. ఇటువంటి స్త్రీ వాద ఉద్యమాలు సమన్యాయం జరిగేందుకు దోహదపడనున్నాయి. ఆర్థిక అసమానతలను తొలగించేందుకూ సహాయపడే అవకాశం ఉంది. ప్రస్తుత మున్నార్ ఉద్యమం ఓ చిన్న నిప్పు రవ్వ అగ్గిని రాజేసినట్లుగా ఇంతింతై.. మొత్తం ప్రపంచాన్ని తాకనుంది. అసురక్షిత కార్మికులు, శ్రామిక ఒప్పందాలు, యజమానుల ద్రోహం, వంటి అనేకమైన ఆర్థిక అంశాలను విమర్శించేందుకు తావునిచ్చింది. అనేక సమస్యలు స్త్రీలు పురుషులకంటే సమర్థవంతంగా నిర్వర్తించగలరని నిరూపించింది.

ఇండియా రాజధాని ఢిల్లీలో జరిగిన అభయ అత్యాచార ఘటనలోనూ మహిళా ఉద్యమం తారాస్థాయికి చేరి, ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపింది. అప్పట్లో జరిపిన అతి పెద్ద ఉద్యమం ఏకంగా చట్టాల్లోనే కీలకమైన మార్పును తెచ్చాయి. అనంతర పరిణామంలో ఇటీవల లైంగిక హింసలపై మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. లైంగిక హింస కేసులు నమోదు చేసేందుకు ధైర్యం చేస్తున్నారు. అదే రీతిన మున్నార్ ఉద్యమం.. ప్రపంచంలోనే మహిళా వివక్షను ప్రశ్నించేందుకు ఓ స్ఫూర్తిగా మారనుంది.

Advertisement
Advertisement