71 రెట్లు పెరిగిన గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు! | Sakshi
Sakshi News home page

71 రెట్లు పెరిగిన గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు!

Published Mon, Jun 1 2015 4:33 AM

71 రెట్లు పెరిగిన గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు! - Sakshi

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఆదివారం భువనేశ్వర్‌లో వీధి ప్రదర్శనలో పాల్గొన్న వలంటీర్లు
న్యూఢిల్లీ: దేశంలో గుట్కా, ఇతర నమిలే పొగాకు ఉత్పత్తుల తయారీ వేగంగా 71 రెట్లు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం(మే 31) సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారాన్ని పేర్కొంటూ డబ్ల్యూహెచ్‌వో ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. 2013-14, 2014-2015 ఆర్థిక సంవత్సరాల్లో ఈ ఆకస్మిక పెరుగుదల నమోదైందని ఆ సంస్థ తెలిపింది.

దేశంలో గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీపై వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిషేధం విధించాయని, అయితే నియంత్రణ చర్యలకు, దేశీయ పొగాకు ఉత్పత్తుల తయారీ లెక్కలకు మధ్య పొంతన కుదరడం లేదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌ల మధ్య వివిధ రాష్ట్రాల్లో 16 లక్షల విదేశీ గుట్కా ప్యాకెట్లను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డెరైక్టరేట్ పట్టుకుందని వెల్లడించింది.

అదేవిధంగా 2014లో భారత్ నుంచి రూ. 186-300 కోట్ల గుట్కా ఉత్పత్తులు ఎగుమతయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. దేశంలో గుజరాత్ తప్ప మిగతా రాష్ట్రాలేవీ గుట్కాల తయారీపై నిషేధం విధించలేదని, అన్ని రాష్ట్రాలూ ఎగుమతులకు అనుమతిస్తున్నాయని పేర్కొంది.

Advertisement
Advertisement