బుందేల్‌ఖండ్‌ నుంచే అఖిలేష్‌ పోటీ ఎందుకు? | Sakshi
Sakshi News home page

బుందేల్‌ఖండ్‌ నుంచే అఖిలేష్‌ పోటీ ఎందుకు?

Published Thu, Jan 12 2017 6:40 PM

బుందేల్‌ఖండ్‌ నుంచే అఖిలేష్‌ పోటీ ఎందుకు? - Sakshi

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  బుందేల్‌ఖండ్‌ ప్రాంతం నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ రెండు రోజుల క్రితం సూచనప్రాయంగా తెలియజేశారు. ఎందుకు ఆయన అక్కడినుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? పోటీ చేస్తే ఆయనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
 
తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌తో తగువును కొనసాగిస్తూనే అఖిలేష్‌ యాదవ్‌ బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో పలు ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలోనే బాగా వెనకబడి ఉన్న ఆ ప్రాంతంలో పలు సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను కూడా చేపట్టారు. మరిన్ని అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. పలు ఉచిత పథకాలను ప్రకటించారు. ఆ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ జాతీయ ఉపాధి హామీ, ఆహార భద్రతా పథకం, మధ్యాహ్న భోజన పథకాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు సామాజిక భద్రతా పింఛన్లను మంజూరుచేస్తానని చెప్పారు. 
 
జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఎప్పుడూ వార్తల్లో నిలిచే బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ప్రస్తుతం మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో తమ పట్టు నిలబెట్టుకోవాలన్నది అఖిలేష్‌ ఎత్తుగడ. రాష్ట్ర అసెంబ్లీలో 403 సీట్లు ఉండగా బుందేల్‌ఖండ్‌లో కేవలం 19 స్థానాలు మాత్రమే ఉన్నాయి. సాంస్కృతికంగా, చారిత్రకంగా ఈ ప్రాంతానికి ఎంతో గుర్తింపు ఉంది. ఇటు ఉత్తరప్రదేశ్‌తో పాటు అటు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్‌పై పట్టు సాధిస్తే మున్ముందు జాతీయ నాయకుడిగా ఎదిగేందుకు కూడా అది ఉపయోగపడుతుంది. అందుకనే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలు కూడా బుందేల్‌ఖండ్‌ అభివృద్ధికి పలు హామీలు ఇస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో అవినీతి, వరుస కరువుల వల్ల ఈ ప్రాంతం బాగా వెనకపడి పోయింది. నిజాయితీపరుడని పేరున్నందువల్ల అఖిలేష్‌ వాగ్దానాలను బుందేల్‌ఖండ్‌ ప్రజలు విశ్వసించే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
రాష్ట్రంలో ఎటావా, కనౌజ్, మైపూరి, ఫరూకాబాద్‌లో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పట్టుంది. దానికి బుందేల్‌ఖండ్‌ సీట్లు తోడైతే పార్టీకి ఎన్నికల్లో విజయావకాశాలు పెరుగుతాయన్నది అఖిలేష్‌ వ్యూహం. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బుందేల్‌ఖండ్‌లో బీఎస్పీకి 7, ఎస్పీకి 5, కాంగ్రెస్‌కు 4, బీజేపీకి 3 సీట్లు వచ్చాయి. వాటిలో బాబినా లేదా మహోబా అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని అఖిలేష్‌ భావిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ రెండు సీట్లకు కూడా ప్రస్తుతం బీఎస్పీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక సీటు నుంచి పోటీచేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో అత్మవిశ్వాసం నెలకొల్పాలన్నది అఖిలేష్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

Advertisement
Advertisement