భారత్‌కు చైనా ఎందుకు వ్యతిరేకం? | Sakshi
Sakshi News home page

భారత్‌కు చైనా ఎందుకు వ్యతిరేకం?

Published Tue, Jan 3 2017 5:36 PM

భారత్‌కు చైనా ఎందుకు వ్యతిరేకం?

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్‌ టెర్రరిస్టు సంస్థ నాయకుడు మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా పరిగణించేందుకు అంతర్జాతీయంగా భారత్‌ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని చైనా ఎందుకు అడ్డుకుంటోంది? చైనాలోని పశ్చిమ జింజియాంగ్‌ రాష్ట్రంలో ముస్లిం తిరుగుబాటుదారులను ఇస్లాం టెర్రరిస్టులు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కూడా చైనా, టెర్రరిస్టులను ఎందుకు వెనకేసుకొస్తోంది? జైషే మొహమ్మద్‌ సంస్థను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇదివరకే టెర్రరిస్టు సంస్థగా గుర్తించింది. దాని నాయకుడు మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా గుర్తించాలంటూ భారత్‌ చేసిన ప్రతిపాదనను డిసెంబర్‌ 30వ తేదీన భద్రతా మండలిలో చైనా వీటో చేసింది. ఎందుకు?

కారణాలు......
1. పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా సంచరిస్తున్న మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా నేడు గుర్తిస్తే రేపు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్తాన్‌ను గుర్తించాలంటూ భారత్‌ డిమాండ్‌ తీసుకొస్తుందన్నది చైనా భయం.

2. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ముద్రపడితే కొన్ని లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న చైనా, పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ కుప్పకూలిపోతుంది. ‘ఒకే బెల్ట్, ఒకే రోడ్‌’ నినాదంతో యూరప్, మధ్యప్రాచ్య దేశాలతో వాణిజ్య వ్యాపారాల కోసం నిర్మిస్తున్న మౌలిక సౌకర్యాలు మంటగలసిపోతాయన్న ఆందోళన. ఈ ఎకనామిక్‌ కారిడార్‌ పూర్తయితే ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ బలమైన ఆర్థిక దేశంగా చైనా ఆవిర్భవిస్తుంది.

3. పాకిస్తాన్‌ నుంచి భారత్‌ భూభాగంలో టెర్రరిస్టు కార్యకలాపాలను అనుమతించినట్లయితే అంతర్గతంగా పాకిస్థాన్‌ భూభాగంలో ఆ టెర్రరిస్టులు అలాంటి కార్యకలాపాలు నిర్వహించరన్న నమ్మకం.

4. పాకిస్తాన్‌ ప్రభుత్వంతో లాబీయింగ్‌ చేయడం ద్వారా దానికి సరిహద్దులో ఉన్న అప్ఘానిస్తాన్‌లో తన ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లవచ్చన్న ఆశ. ఇటీవల చైనా, పాకిస్తాన్, మాస్కో నాయకులు సమావేశమై అఫ్ఘానిస్తాన్‌లో టెర్రరిస్టు కార్యకలాపాలను ఎలా నిరోధించాలన్న విషయమై చర్చలు జరపడం గమనార్హం.

5. ఇప్పటికే అల్‌కాయిదా, ఇస్లామిక్‌ స్టేట్, ఈస్ట్‌తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ లాంటి టెర్రరిస్టు సంస్థలు చైనా ముస్లిం వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జేషే మొహమ్మద్‌ లాంటి సంస్థలను కూడా ఎందుకు శత్రువు చేసుకోవడం అన్నది మరో అంశం.

6. అమెరికాతో బలమైన బంధం కలిగి ఉన్నందున అంతర్జాతీయ ప్రాదేశిక రాజకీయ శత్రువుగా భారత్‌ను చైనా పరిగణించడం మరో కారణం.

(హైడల్‌బర్గ్‌ యూనివర్శిటీలో దక్షిణాసియా వ్యవహారాల నిపుణులుగా పనిచేస్తున్న  సియాగ్‌ ఓ వూల్ఫ్‌ ఓ పత్రికా ఇంటర్వ్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా ఈ కథనం)
 

Advertisement

తప్పక చదవండి

Advertisement