బావమరుదులు, భార్య చేతిలో పాత్రికేయుడి హత్య! | Sakshi
Sakshi News home page

బావమరుదులు, భార్య చేతిలో పాత్రికేయుడి హత్య!

Published Fri, May 30 2014 11:33 AM

బావమరుదులు, భార్య చేతిలో పాత్రికేయుడి హత్య!

ఒక  వార్తాకథనం పాత్రికేయుడి హత్యకు దారితీసింది. హత్య జరిగిన 8 నెలలకు శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేశారు. ఈ కేసులో హతుడి సొంత బావమరుదులే నిందితులు కాగా.. అతడి భార్య కూడా హత్యకు సహకరించింది! ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం తాలూకాలో జరిగింది.

బెంగళూరు కిర్లోస్కర్ ఫౌంట్రి కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్ నాయక్(29) ‘పత్రికా లోకం’ పేరుతో ఒక పత్రిక నడుపుతున్నాడు. తన సొంత గ్రామం కెళగిననాయకరండనహళ్లికి చెందిన పద్మబాయిని ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి తరచూ గొడవపడేవారు. ఆమె తమ్ముళ్లు కూడా వచ్చి, అక్క తరఫున మాట్లాడుతూ శ్రీనివాస్‌ను అవమానించేవారు. శ్రీనివాస్ నాయక్ బెంగళూరులోనే ఎక్కువ కాలం గడుపుతుండటంతో పద్మబాయికి వెంకటేశ్ అనే ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దాన్ని ఆమె తల్లి, సోదరులు కూడా ప్రోత్సహించారు. దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన శ్రీనివాస్ నాయక్ తన సొంత పత్రికలోనే పద్మబాయి తల్లి, తమ్ముళ్లు దొంగ సారా కాస్తున్నట్లు ప్రత్యేక కథనం రాశాడు. దీంతో పలుమార్లు బావమరుదులు శ్రీనివాస్‌పై దాడులు చేశారు. పరస్పర దాడులతో విద్వేషాలు రగిలాయి.   

2013 ఆగస్టు 5న కెళగిన నాయకరండనహళ్లి వద్ద రాత్రి ఒంటరిగా దొరికిన శ్రీనివాస్ నాయక్‌పై అతడి బావమరుదులు రవినాయక్, నటరాజ్ నాయక్, సంతోష్ నాయక్‌ దాడిచేసి హత్యచేశారు. మృతదేహాన్ని పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న టెర్రాకాన్ సాయిఎన్‌క్లేవ్ లేఔట్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలంలో గుంతతవ్వి పూడ్చివేశారు. శ్రీనివాస్ నాయక్ కనిపించలేదని ఆయన తల్లి మునిబాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, భార్య మాత్రం ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్ బావమరుదులపై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం తహసీల్దార్ సిద్ధలింగయ్య సమక్షంలో డీవైఎస్పీ కోనప్ప రెడ్డి, సీఐ శివారెడ్డి, రూరల్ ఎస్సై నవీన్ సిబ్బందితో కలసి శవాన్ని పూడ్చి పెట్టిన ప్రాంతంలో జేసీబీతో వెలికి తీయించారు. ఈ ఘటనకు సంబంధించి డీవైఎస్పీ కోనప్ప రెడ్డి మాట్లాడుతూ ఈ హత్య కేసులో మరో ఇద్దరు మహిళలకు కూడా సంబంధం ఉందని తెలిపారు. వారినీ త్వరలో అరెస్టు చేస్తామని, అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement