వారికి సన్మానం చేస్తాం! | Sakshi
Sakshi News home page

వారికి సన్మానం చేస్తాం!

Published Thu, Aug 11 2016 4:01 PM

వారికి సన్మానం చేస్తాం! - Sakshi

తెల్లవారుజామున నడిరోడ్డుపై ఓ వ్యక్తిని వాహనం ఢీకొంది. నెత్తురోడుతూ నిస్సహాయంగా పడి ఉన్న అతడికి సహాయం చేయాల్సిందిపోయి.. ఓ వ్యక్తి ఆ అభాగ్యుడి సెల్‌ఫోన్‌ ఎత్తుకొని పారిపోయాడు. మానవతా దృక్పథంతో ఎవరూ స్పందించకపోవడంతో రోడ్డు మీదనే నెత్తురోడుతూ ఆ బడుగు సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన మనుషుల్లో తగ్గిపోతున్నా కనీస మానవతా స్పందనను పట్టిచూపించింది. సాటి మనిషి ఎలాపోతే మనకేంటన్న ఉదాసీనభావం ప్రజల్లో పేరుకుపోతున్నట్టు ఈ ఘటన చాటింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త పథకం తీసుకురావాలని భావిస్తోంది. రోడ్డుప్రమాదాలు, ఆపద సమయాల్లో బాధితులకు వెంటనే సాయం అందించి, కాపాడే వారిని గుర్తించి, సత్కరించాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి ప్రభుత్వం తరఫున రివార్డులు అందజేస్తామని, ఇందుకు ముందుకొచ్చే ట్యాక్సీ డ్రైవర్లు, రిక్షాకార్మికులకూ రివార్డులు అందిస్తామని ఢిల్లీ హోంమంత్రి సత్యేందర్‌ జైన్‌ ప్రకటించారు. ఇందుకోసం పథకం ముసాయిదాను రూపొందిస్తున్నామని, త్వరలోనే ఈ పథకాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రోడ్డుప్రమాద బాధితులకు ప్రజల నుంచి తక్షణసాయం అందేవిధంగా ఈ పథకం ఉంటుందని చెప్పారు.

Advertisement
Advertisement