Sakshi News home page

30 నుంచి తిరుమలకు బస్సులు ఆపేస్తాం

Published Sat, Aug 22 2015 9:39 PM

30 నుంచి తిరుమలకు బస్సులు ఆపేస్తాం - Sakshi

- ధర్నాలో ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల హెచ్చరిక
సాక్షి, తిరుమల: ఉద్యోగులు, కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఈ నెల 30 నుంచి తిరుమలకు బస్సు సర్వీసులు నిలిపేస్తామని ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి. సమస్యల సాధన కోసం రీజనల్ కమిటీ ఆదేశాల మేరకు శ నివారం ఇక్కడి ఆర్టీసీ డిపోలో సుమారు 250 మంది ధర్నాకు దిగారు. ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి డి.సురేంద్ర, ఎస్‌డబ్ల్యూ డిపో కార్యదర్శి కె.భాస్కర్, వైఎస్సార్ ఆర్టీసీ డిపో కార్యదర్శి కేబీ రాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఆ నష్టం భరించడానికి ఆర్టీసీని ప్రభుత్వం ప్రజలకు దూరం చేస్తోందని నేతలన్నారు.

డ్రైవర్లు, కండక్టర్లకు ఓటీ తగ్గించడం బాధాకరమని పేర్కొన్నారు. ఉద్యోగులు, కార్మికులతో యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. సమస్యలకు పరిష్కారం చూపకపోతే దశలవారీగా ఆందోళన, సమ్మె బాట పడతామన్నారు. తిరుమలకు బస్సులను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా డిపోలో ధర్నాకు దిగడంపై విజిలెన్స్ సిబ్బంది అభ్యంతరం తెలపడం గమనార్హం.

Advertisement
Advertisement