‘డబుల్‌’ శపథం | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ శపథం

Published Sat, Mar 18 2017 4:03 AM

‘డబుల్‌’ శపథం - Sakshi

- ఏడాదిలోగా 2 లక్షల డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టి తీరుతం
- లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగబోం: సీఎం కేసీఆర్‌
- హైదరాబాద్‌లో లక్ష, గ్రామాల్లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తాం
- ప్రస్తుతం నిర్మాణంలో 32 వేల ఇళ్లు... మేం కట్టించే 2 లక్షల ఇళ్లు
- కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కట్టించిన 14 లక్షల ఇళ్లతో సమానం
- కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తాం
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫీజులు నెలనెలా చెల్లిస్తాం.. హాస్టల్‌ మెస్‌ చార్జీలు పెంచుతాం.. ప్రాజెక్టులు పూర్తయ్యాక ఉచిత విద్యుత్‌ ఎందుకు?


సాక్షి, హైదరాబాద్‌:
తమ ప్రభుత్వం చెప్పిన విధంగానే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి తీరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో మరో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. ఈ ఏడాది చివరిలోగా 2 లక్షల ఇళ్లను నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని శపథం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32 వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వానికి ఇష్టం లేకనో.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానో ఇళ్ల నిర్మాణం ఆగిపోలేదని, వివిధ అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణాలకు రాకపోవటంతోనే ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. యూనిట్‌ వ్యయాన్ని బట్టి.. తమ ప్రభుత్వం నిర్మించబోయే 2 లక్షల ఇళ్లు గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కట్టించిన 14 లక్షల ఇళ్లతో సమానమని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల బిజీలో ఉన్నారని, ఆయన సమయం ఇవ్వగానే వెళ్దామని చెప్పారు. ఉర్దూ డీఎస్సీ ఫైలుపై ఇప్పటికే తాను సంతకం చేశానని, ఇందుకు అనుసరించాల్సిన విధానాన్ని రూపొందించే కసరత్తులో భాగంగా ప్రస్తుతం విద్యాశాఖ పరిధిలో ఉందన్నారు. త్వరలోనే నోటిఫికేషన్‌ వస్తుందని వెల్లడించారు. త్వరలోనే దళితుల అభివృద్ధికి చట్టం తీసుకు వస్తామని, ఈ సమావేశాల్లోనే ఎస్సీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ యాక్టును ప్రవేశపెడతామని చెప్పారు.

ఫీజులు ఇక నెలనెలా..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు చెల్లించాల్సిన ట్యూషన్‌ ఫీజులు(ఆర్‌టీఎఫ్, ఎంటీఎఫ్‌) నెలనెలా విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలను పెంచుతామని, మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చే సిఫారసు మేరకు ఈ పెంపు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశాల్లోనే మెస్‌ చార్జీల పెంపును ప్రకటిస్తామని పేర్కొన్నారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులో రూ.35 వేలు చెల్లించాలనే సీలింగ్‌ ఏమీ లేదని, సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లే బీసీ విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్‌కు బడ్జెట్‌లో కేవలం రూ.20 కోట్లు కేటాయించారని టీడీపీ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అభ్యంతరం తెలపగా.. నిర్ణీత సంఖ్య, కేటాయింపులతో సంబంధం లేకుండా విదేశాలకు వెళ్లే వారందరికీ స్టైఫండ్‌ ఇవ్వాలనే ఆలోచన ఉందని సీఎం హామీ ఇచ్చారు. బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవన నిర్మాణాలకు స్థల సేకరణ జరుగుతోందని, భవిష్యత్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. భారీగా గొర్రెల పెంపకం అవసరాల దృష్ట్యా 265 వెటర్నరీ డాక్టర్‌ పోస్టులను భర్తీ చేశామన్నారు. రోస్టర్‌లో ఫిట్‌కాని వారిని కూడా తాత్కాలికంగా తీసుకుంటున్నామని తెలిపారు. రోస్టర్‌లో ఫిట్‌ అయ్యే సమయంలో వారిని రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. ఏజెన్సీ ఏరియాలోనూ ఆసక్తి ఉన్న వారికి డిమాండ్‌ను బట్టి మేకలు, గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామన్నారు.

సదర్‌మట్‌ రైతులకు పరిహారమిచ్చాం
మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయిం చిన రూ.1,250 కోట్లకు అదనంగా రూ.250 కోట్లు కేటాయించాలని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ చేసిన విజ్ఞప్తికి సీఎం స్పందించారు. దీనిపై ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఎంబీసీల్లో 108 కులాలున్నాయని, వారికి రుణాలిచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్‌ జిల్లాలో సదర్‌మట్‌ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణకు పంట పొలాలను తవ్వి పైపులైన్లు వేస్తున్నారని, అందుకు కనీసం నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు చేస్తున్న అభ్యర్థనను సభ దృష్టికి తీసుకువచ్చారు. పంప్‌సెట్లపై సర్‌చార్జిని ఎత్తివేస్తామని టీఆర్‌ ఎస్‌ ఇచ్చిన ఎన్నికల హామీ అమలు కాలేదన్నా రు. సర్‌చార్జి ఎప్పట్లాగే వసూలు చేస్తున్నారని మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ రైతు ఆవేదనను సభ దృష్టికి తీసుకు వస్తే రాత్రికి రాత్రే ఆ రైతులకు సంబంధించిన విద్యుత్‌ కనెక్షన్లు కట్‌ చేసినట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. సదర్‌మట్‌ పరిధిలోని రైతులకు ఇప్పటికే పంట పరిహారం చెల్లించినట్లు బదులిచ్చారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.వెయ్యి కోట్లు అవసరమని, అందులో ఈ ఏడాది రూ.600 కోట్లు కేటాయించామని చెప్పారు. సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా.. ఐటీడీఏల పరిధిలో సమర్థంగా పని చేయాలనే ఉద్దేశంతో యువ ఐఏఎస్‌ అధికారులను నియమించే ఆలోచన ఉందని, ఐఏఎస్‌ అధికారుల కొరత ఉండటంతో కేంద్రాన్ని కేడర్‌ రివ్యూ కోరామని, అధికారులు సర్దుబాటు కాగానే భర్తీ చేస్తామని సీఎం చెప్పారు.

అన్నింటికీ రెవెన్యూ విధానం ఉండదు
ప్రభుత్వం అమలు చేసే ప్రాజెక్టులు, కార్యక్రమాలన్నింటికీ రెవెన్యూ విధానం అను సరించటం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేశా రు. మిషన్‌ భగీరథ ద్వారా పరిశ్రమలు, పట్ట ణ స్థానిక సంస్థలకు సైతం తాగునీటి కోటా ఉండటంతో కొంత ఆదాయం వస్తుందని అన్నారు. ఇంటింటికీ రక్షిత మంచినీరు అంది తే ప్రజలు సైతం కొంతచార్జి చెల్లించేందుకు సంతోషంగా ముందుకు వస్తారన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తయి సాగునీరందితే ఉచిత విద్యుత్తు ఇస్తారా..? అప్పుడు కచ్చితంగా ఆపేస్తారు..? ఉచితమెందుకు.. నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తే డబ్బులు కడతామని గతంలోనే రైతులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చినట్టు సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని, వచ్చే ఏడాది రాష్ట్రంలో 8.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీంతో లక్షల కోట్ల పంటలు పండుతాయని, చేపలు, గొర్రెలు అన్నింటి ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుందని చెప్పారు.

800 మెగావాట్లతో సింగరేణి మూడో ప్లాంట్‌
- సూపర్‌ క్రిటికల్‌కు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌
సాక్షి, హైదరాబాద్‌: సూపర్‌ క్రిటికల్‌ బాయి లర్‌ టెక్నాలజీ ఆధారంగా 800 మెగావాట్ల సామ ర్థ్యంతో మూడో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మిం చేందుకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ యాజమా న్యానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆదిలా బాద్‌ జిల్లా జైపూర్‌లో 1200 (2,600) మెగావాట్ల సబ్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని సింగరేణి సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. అదే ప్రాంతంలో సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతోనే 600 మెగా వాట్ల మూడో విద్యుత్‌ ప్లాంట్‌ను నిర్మించాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మిస్తుండటంతో ఈ విద్యుత్‌ ప్లాంట్‌ను నిర్మించేందుకు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ కొద్ది రోజుల క్రితం అనుమతి నిరాక రించింది. 13వ పంచవర్ష ప్రణాళిక కాలం(2017– 21)లో సబ్‌క్రిటికల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు అనుమతించరాదని నిర్ణయించిన నేపథ్యంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేమని అప్పట్లో స్పష్టం చేసింది. సబ్‌ క్రిటికల్‌కు బదులు సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో కొత్త థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి అనుమతి కోరితే పరిశీలిస్తామని సూచించింది. ఈ నేపథ్యంలో 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు అనుమతించాలని సింగరేణి యాజమాన్యం ఇటీవల సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు పంపించింది. తాజాగా ముఖ్యమంత్రి దీన్ని అనుమతించారని రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement