సివిల్స్‌లో.. దుమ్మురేపారు | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో.. దుమ్మురేపారు

Published Sun, Jul 5 2015 2:47 AM

సివిల్స్‌లో.. దుమ్మురేపారు

* సివిల్స్‌లో సత్తాచాటిన మహిళలు
* టాప్ 5లో తొలి నాలుగు స్థానాలు వారికే మొదటిసారిగా వికలాంగ అభ్యర్థినికి ఫస్ట్ ర్యాంకు
* ఢిల్లీకి చెందిన ఇరా సింఘాల్ ఘనత
* మొదటి ప్రయత్నంలోనే రేణురాజ్‌కు రెండో ర్యాంకు  

 
న్యూఢిల్లీ: ఈసారి సివిల్స్‌లో మహిళలు దుమ్మురేపారు! ఏకంగా తొలి నాలుగు స్థానాలు కైవసం చేసుకుని రికార్డు సృష్టించడం ఒక విశేషమైతే మొదటిసారిగా వికలాంగ మహిళా అభ్యర్థిని ఫస్ట్ ర్యాంకు దక్కించుకోవడం మరో విశేషం! ఢిల్లీకి చెందిన ఇరా సింఘాల్ ఈ ఘనత సాధించారు. వెన్ను సంబంధ వైకల్యం (స్కొలియోసిస్)తో బాధపడుతున్న ఈ 31 ఏళ్ల మహిళ.. ఆరో ప్రయత్నంలో ఫస్ట్‌ర్యాంకు సాధించి జయకేతనం ఎగురవేశారు. ఈమె ప్రస్తుతం ఐఆర్‌ఎస్ అధికారిణిగాపనిచేస్తున్నారు. కేరళకు చెందిన రేణు రాజ్ రెండోస్థానం, ఢిల్లీకి చెందిన మరో ఐఆర్‌ఎస్ అధికారి నిధి గుప్తా మూడోస్థానంలో నిలిచారు. వీరిద్దరి వయసు 27 ఏళ్లే కావడం గమనార్హం. ఎంబీబీఎస్ పూర్తిచేసి కేరళలోని కొల్లామ్‌లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న రేణు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో రెండో ర్యాంకు సాధించారు. ఇక ఢిల్లీకి చెందిన వందనా రావ్ నాలుగో ర్యాంకు కైవసం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి సుహర్ష భగత్ ఐదో స్థానంలో నిలిచారు. శనివారం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ప్రకటించింది.
 
  వివిధ సర్వీసులకు ఎంపికైన 1,236 మంది అభ్యర్థుల్లో.. జనరల్ కేటగిరీలో 590, ఓబీసీ కేటగిరీలో 354, ఎస్సీ కేటగిరీలో 194, ఎస్టీ కేటగిరీలో 98 మంది ఉన్నారు. ప్రస్తుతం ఐఏఎస్‌లో 180, ఐఎఫ్‌ఎస్‌లో 32, ఐపీఎస్‌లో 150, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏలో 710, గ్రూప్-బీ సర్వీసెస్‌లో 292 ఖాళీలు ఉన్నాయని కేంద్రం యూపీఎస్సీకి తెలిపింది. ఈ సర్వీసులను తాజా ఫలితాల ఆధారంగా భర్తీ చేయనున్నారు. గతేడాది ఆగస్టు 24న యూపీఎస్సీ దేశవ్యాప్తంగా 2,137 కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా 4.51 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 16,933 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. డిసెంబర్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించగా.. 3,308 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వీరిలో 3,303 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇంటర్వ్యూలు ముగిసిన నాలుగు రోజుల్లోనే ఫలితాలు వెల్లడించారు. వైకల్యం కారణంగా ఐఆర్‌ఎస్ పోస్టు నిరాకరించడంపై 2012లో ఇరా సింఘాల్ క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
 
 టాప్-10 ర్యాంకర్లు వీరే
 1. ఇరా సింఘాల్, 2. రేణు రాజ్,
 3. నిధి గుప్తా, 4. వందనా రావు,
 5. సుహర్షా భగత్, 6. చారుశ్రీ,
 7. లోక్‌బంధు, 8. నితీష్. కె,
 9. ఆశిష్ కుమార్, 10. అర్వింద్ సింగ్.

Advertisement

తప్పక చదవండి

Advertisement