Sakshi News home page

మహిళా ఐపీఎస్‌పై దాడి

Published Sun, Sep 13 2015 2:20 AM

దుండగుడి దాడిలో గాయపడిన ఐపీఎస్ ఎస్. ఎం. రత్న

 సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో నగలు దోచుకెళ్లిన దుండగుడు
 నెల్లూరు జిల్లాలో ఘటన
 రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్ టీం

 
 నెల్లూరు(అర్బన్)/గూడూరు: సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళా ఐపీఎస్ అధికారిపైనే దాడి చేసి నగలు దోచుకెళ్లిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలి తమ్ముడు మురళీకృష్ణ, నెల్లూరు రైల్వే సీఐ నరసింహరాజు కథనం ప్రకారం.. ఐపీఎస్ అధికారి ఎస్.ఎం.రత్న(సేనాని మునిరత్న) స్వస్థలం సూళ్లూరుపేట కాగా చెన్నైలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తూ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. అప్పుడప్పుడు చెన్నైలో నివసించే తమ్ముడు మురళీకృష్ణ వద్దకు వెళ్లి వచ్చేవారు. అదే క్రమంలో శుక్రవారం రాత్రి సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టేషన్‌లో దిగారు. అక్కడి నుంచి చెన్నైకు వెళ్లేందుకు ఏమైనా రైళ్లు ఉన్నాయా? అని టీసీని అడగడంతో గూడూరు జంక్షన్‌కు వెళ్లాలని సూచించారు.
 
 దీంతో ఆమె వచ్చిన సింహపురిలోనే మళ్లీ గూడూరుకు బయలుదేరారు. అయితే ఆమె అనుకోకుండా వికలాంగుల బోగీలో ఎక్కారు. ఆ బోగీలో ఆమెతో పాటు మరోవ్యక్తి మాత్రమే ఉన్నారు. మనుబోలు దాటగానే ఆమెపై బోగీలోని వ్యక్తి దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఆమె తేరుకునేలోపు ఆగంతకుడు బంగారు చైను, గాజులు, రెండు ఉంగరాలు, పర్సులో ఉన్న రూ. 2వేల నగదు లాక్కున్నాడు. గూడూరు సమీపంలో రైలు నెమ్మదికాగానే దూకేసి పారిపోయాడు. తేరుకున్న రత్న గూడూరులో దిగి పోలీసులకు సమాచారమిచ్చారు. గూడూరు పోలీసులు అక్కడి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని అపోలోకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ముఖంపై తీవ్రంగా కొట్టడంతో ఆ భాగం ఉబ్బిందని వైద్యులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement