ఏ దేశంలో ఇంటర్నెట్ నెట్‌వర్క్ ఎలా ఉంది? | Sakshi
Sakshi News home page

ఏ దేశంలో ఇంటర్నెట్ నెట్‌వర్క్ ఎలా ఉంది?

Published Tue, Aug 9 2016 6:54 PM

ఏ దేశంలో ఇంటర్నెట్ నెట్‌వర్క్ ఎలా ఉంది?

న్యూయార్క్: నేడు ఇంటర్నెట్ నెట్‌వర్క్ లేకుండా ఆధునిక ప్రపంచమే లేదు. ప్రపంచంలో ఏ ఖండంలో, ఏ దేశంలో ఇంటర్నెట్ నెట్‌వర్క్ ఎలా ఉంది? ఎక్కడ కేంద్రీకృతమై ఉంది, ఎక్కడ పలుచగా ఉంది? ఎక్కడ అంతంత మాత్రంగా ఉంది? తెలసుకోవడం ఆసక్తికరమైన అంశాలు. ఈ అంశాలపైనే దృష్టిని కేంద్రీకరించి అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఇంటర్నెట్ కార్టోగ్రాఫర్, కంప్యూటర్ సైంటిస్ట్ జాన్ మ్యాథర్లీ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌కు సంబంధించి ప్రపంచ మ్యాప్‌ను రూపొందించారు.

 వాస్తవానికి ఈ మ్యాప్‌ను 2014లోనే రూపొందించగా, ఈ రెండేళ్లకాలంలో విస్తరించిన నెట్‌వర్క్‌తో ఆ మ్యాప్‌ను ఇప్పుడు ఆధునీకరించారు. దీన్ని రూపొందించేందుకు ఆయనకు 12 గంటల సమయం పట్టింది. కంప్యూటర్ ఐపీ లేదా ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్‌కు ఇంటర్నెట్ నెట్‌వర్క్ నిర్వహణ సాఫ్ట్‌వేర్ ‘పింగ్’ద్వారా సంకేతాలను పంపించి, ఇంటర్నెట్‌కు అనుసంధానించిన కంప్యూటర్, మొబైల్, ఇతర డివెసైస్‌ను గుర్తించారు. రోటర్ల ద్వారా కూడా నెట్‌వర్క్ ఐపీ అడ్రస్‌లను కనుగొన్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి ఇంటర్నెట్ నెట్‌వర్క్ మ్యాప్‌ను రూపొందించారు.

 నెట్‌వర్క్ ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలను ఎరపు రంగులో, కొంచెం తక్కువగా ఉన్న ప్రాంతాలను పసుపు రంగులో, పలుచగా ఉన్న ప్రాంతాలను ఆకుపచ్చ రంగులో, అతి తక్కువగా నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాలను నలుపురంగులో సూచించారు. చైనాలో కంప్యూటర్ నెట్‌వర్క్ ఎంతో విస్తరించి ఉన్నప్పటికీ ఆ దేశాన్ని మాత్రం నలుపు రంగులోనే సూచించారు. ఐపీ చిరునామాకు పంపిన ‘పింగ్’ సంకేతాలను అడ్డుకునే అంతర్గత వ్యవస్థ చైనాలో ఉండడమే అందుకు కారణమని కంప్యూటర్ సైంటిస్ట్ మ్యాథర్లీ తెలిపారు.

 యూరప్‌లోని పలు దేశాలతోపాటు అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాల్లో ఇంటర్నెట్ నెట్‌వర్క్ ఎక్కువ కేంద్రీకృతమై ఉందని, ఆశ్చర్యంగా మధ్య అమెరికాలో నెట్‌వర్క్ అతి తక్కువగా ఉందని ఈ మ్యాప్‌లో వెల్లడైంది. మధ్య అమెరికాలో నెట్‌వర్క్ తక్కువగా ఉండడానికి అక్కడ జనాభా చాలా తక్కువగా ఉండడమే కారణమని మ్యాథర్లీ వివరించారు. ఊహించినట్లుగానే కాలిఫోర్నియా, సిలికాన్ వ్యాలీలో నెట్‌వర్క్ సాంద్రత ఎక్కువగా ఉంది. వర్ధమాన దేశమైన భారత్‌లో కూడా కంప్యూటర్ నెట్‌వర్క్ అంతటా ఎక్కువగా వ్యాపించినట్లు మ్యాప్‌లో వెల్లడయింది. ప్రపంచంలోకెల్లా ఆఫ్రికా దేశాల్లో నెట్‌వర్క్ తక్కువగా ఉంది.

Advertisement
Advertisement