మొండి బకాయిల బండ రూ. 2.22 లక్షల కోట్లు | Sakshi
Sakshi News home page

మొండి బకాయిల బండ రూ. 2.22 లక్షల కోట్లు

Published Wed, Feb 12 2014 1:37 AM

మొండి బకాయిల బండ  రూ. 2.22 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) పేరుకుపోతున్నాయని ప్రభుత్వం పార్ల్లమెంటులో అంగీకరించింది. రాజ్యసభలో ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

 వివరాలు సంక్షిప్తంగా...
     40 లిస్టెడ్ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు 2013 సెప్టెంబర్ నాటికి 2.22 లక్షల కోట్లకు చేరాయి. 2012 సెప్టెంబర్‌లో ఇవి రూ.1.62 లక్షల కోట్లు. అంటే ఏడాది వ్యవధిలో 36.9 శాతం పెరిగిపోయాయి.

     ఇదే కాలంలో యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల ఎన్‌పీఏలు 160 శాతం ఎగసి రూ.2,418 కోట్ల నుంచి రూ.6,286 కోట్లకు చేరాయి.
     ఇండియన్ బ్యాంక్ పరిమాణం ఈ విషయంలో 110 శాతం పెరిగి రూ.1,789 కోట్ల నుంచి రూ.3,765 కోట్లకు చేరింది.
     పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 109 శాతం పెరిగి రూ.1,071 కోట్ల నుంచి రూ.2,240 కోట్లకు ఎగశాయి.

 మూలధనానికి ఇబ్బంది ఉండదు...
 కాగా ఆర్థికశాఖ సహాయమంత్రి నమో నారాయణ్ మీనా మరో ప్రత్యేక సమాధానం ఇస్తూ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేకించి ఉత్పాదక రంగాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ లభ్యత కొరతను ప్రభుత్వం రానీయబోదని పేర్కొంది. 2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు సమకూర్చిన మొత్తం మూలధనం విలువ రూ. 62,234 కోట్లని తెలిపారు.

 ఈ నిధుల వెచ్చింపు వల్ల బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. మూలధనం చెల్లింపులను పెంచడం వల్ల బ్యాంకుల రుణ సామర్థ్యం పెరగడమే కాకుండా, బ్యాంకులు పొందిన లాభాలపై డివిడెండ్, డివిడెండ్ పంపిణీ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ రూపాల్లో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని మంత్రి తెలిపారు.

Advertisement
Advertisement