ఆరుగురికి పునర్జన్మనిచ్చిన యువతి | Sakshi
Sakshi News home page

ఆరుగురికి పునర్జన్మనిచ్చిన యువతి

Published Tue, Jul 29 2014 8:05 PM

ఆరుగురికి పునర్జన్మనిచ్చిన యువతి - Sakshi

 చెన్నై: రోడ్డు ప్రమాదంలో ఎందరో మరణిస్తుంటారు. కానీ మరణించినా జీవించి ఉండేవారు ఎంతో అరుదు. అటువంటి అరుదైన జాబితాలోకి చెన్నైకి చెందిన షీబా (22) చేరింది. తాను మరణిస్తూ అవయవదానం చేసి మరో ఆరుగురిలో జీవించే ఉంది.  చెన్నై పాడికి చెందిన వివాహిత ఎల్.షీబా పాత మహాబలిపురం రోడ్డు (ఓఎమ్‌ఆర్)లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈనెల 27న విధులను ముగించుకుని ద్విచక్రవాహనంపై వస్తుండగా, సాయంత్రం 5.30 గంటల సమయంలో అశోక్‌నగర్ పిల్లర్ వద్ద మరో బైక్ ఢీకొంది. తలకు బలమైన గాయాలు తగిలిన స్థితిలో ఆమెను రామాపురంలోని మియాట్ ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే ఆమె బ్రెయిన్‌డెడ్ అయి కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో వైద్యులు ఆమె బంధువులకు కబురందించి వారి అంగీకారంతో అవయవదానానికి సిద్ధం చేశారు. మియాట్ ఆస్పత్రికి 17 కిలోమీటర్ల దూరం ముగప్పేర్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఒక రోగి గత కొన్నాళ్లుగా గుండెమార్పిడి కోసం ఎదురుచూస్తున్నాడు. రెండు వైద్యశాలల వైద్యులు సమన్వయంతో గుండె మార్పిడికి సిద్ధమయ్యూరు. నగర పోలీస్ కమిషనర్ సాయంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకున్నారు. దారిపొడవునా వంద మంది కానిస్టేబుళ్లను బందోబస్తులో ఉంచారు.

సోమవారం అర్ధరాత్రి 12.50 గంటలకు మియాట నుంచి గుండెతో అంబులెన్స్ బయలుదేరి 17 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి కేవలం 8 నిమిషాల్లో చేరింది. ముగప్పేర్‌లో సిద్ధంగా ఉన్న వైద్యులు ఆగమేఘాలపై గుండెను అమర్చి మరోజీవికి ప్రాణంపోశారు. 'ట్రాఫిక్' సినిమాలో మాదిరి  ఈ ఆపరేషన్ చేశారు.  షీబా నుంచి సేకరించిన కళ్లను శంకర్‌నేత్రాలయ ద్వారా మరో ఇద్దరికి అమర్చారు. రెండు కిడ్నీలను ఇద్దరికి, లివర్ మరొకరికి అమర్చారు. ఇలా షీబా తాను చనిపోతూ ఆరుగురికి జీవితాన్ని, చూపును ప్రసాదించి చిరంజీవిగా నిలిచింది.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement