ప్రాణం తీసిన ఫేస్బుక్ పరిచయం | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఫేస్బుక్ పరిచయం

Published Tue, Jun 21 2016 8:17 PM

ప్రాణం తీసిన ఫేస్బుక్ పరిచయం - Sakshi

కడప : ఫేస్బుక్ పరిచయం ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఖాజీపేటకు చెందిన యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. తాను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నానని.. సాయం చేయాలని అడిగింది. అమ్మాయి మాటలకు కరిగిపోయి ఇంట్లో తెలియకుండా ఆమె అకౌంట్లో డబ్బులు వేశాడు. చివరికి ఈ విషయం ఇంట్లో తెలియడం..ఆపై యువతి మోసం చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేటలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం మేరకు.. ఖాజీపేట బస్టాండులో మాడిచెట్టి నరసింహ ప్రసాద్ అలియాస్ రమేష్ (33) మూడేళ్లుగా టీకొట్టు నిర్వహిస్తున్నాడు. అతడు ఫేస్‌బుక్‌లో ఖాతా ప్రారంభించి ప్రతిరోజు తన మొబైల్ ద్వారా చూసేవాడు. ఇలా విశాఖపట్నానికి చెందిన ఓ అమ్మాయితో అతడికి నెలక్రితం పరిచయమైంది. ఆ పరిచయంతో ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో ఆమె తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని తనను ఆదుకోవాలని కోరింది. ఆమేరకు ఆమె ఎస్‌బీఐలోని గ్రీన్‌కార్డు అకౌంట్ నంబర్(20241371120)కు గతనెల 6వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు రూ.2లక్షలు పంపాడు.

ఈ విషయంలో అతని ఇంట్లో తెలియడంతో గట్టిగా మందలించారు. దీంతో అతను తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్‌కు ఇదే విషయమై తరచూ మెసేజ్ పంపాడు. డబ్బు ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా తెలిపాడు. అయినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. తాను మోసపోయానని.. డబ్బు విషయమై ఇంట్లోని పెద్దలకు ఏం సమాధానం చెప్పాలో దిక్కు తెలియక సోమవారం మధ్యాహ్నం బాత్‌రూంలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఎంతకీ తమ కుమారుడు బాత్‌రూంలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానంతో వారు బాత్‌రూం తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఆ తర్వాత అతని మొబైల్‌ను పరిశీలించగా అందులో ఆ యువతికి పంపిన మెసేజ్‌లు తదితర వివరాలు బయటపడ్డాయి. తర్జనభర్జన అనంతరం మంగళవారం ఉదయం మృతుని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ అమ్మాయి ఎవరు.?
నరసింహ ఫోన్ చేసిన మొబైల్ నంబర్‌తో పాటు బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను పోలీసులు పరిశీలించారు. విశాఖపట్నంలోని సీతంపేటకు చెందిన గార్లే కళ్యాణిగా ఉంది. కాగా బ్యాంక్ అకౌంట్‌కు ఇచ్చిన ఫోన్ నంబరు మరోలా ఉంది. ఆ యువకుడు ప్రతిరోజు ఫోన్ చేసిన నంబర్ వివరాలు సేకరిస్తే అక్కడ అనుశ్రీగా ఉంది. దీంతో   ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement