బికినీ పార్టీలట.. గంతులు వేస్తారట! | Sakshi
Sakshi News home page

బికినీ పార్టీలట.. గంతులు వేస్తారట!

Published Sun, Nov 6 2016 6:39 PM

బికినీ పార్టీలట.. గంతులు వేస్తారట! - Sakshi

విశాఖపట్నం: ఘన చర్రిత కలిగిన విశాఖ సముద్రతీరంలో ‘బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌’ పేరిట నిర్వహిస్తున్న బికినీ పార్టీలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తప్పుబట్టారు. ‘ఇదే విశాఖ గడ్డపై బికినీ పార్టీలు అట. సముద్రతీరంలో టెంట్లు వేస్తారట. తొమ్మిదివేల జంటలను తీసుకొస్తారట. సముద్రతీరంలో వారు గంతులు వేస్తారట’ అని వ్యాఖ్యానించారు. మహిళల మీద చంద్రబాబుకున్న ఈ అగౌరవానికి ఆయనను జైలులో పెట్టిన పాపం లేదని ‘జై ఆంధ్రప్రదేశ్‌’ సభలో ఆయన మండిపడ్డారు.

మహిళలపై అత్యాచారాలు చేసిన వారు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్‌లో ఉన్నారని విమర్శించారు. ‘రిషితేశ్వరి చనిపోయినా పట్టించుకోరు. ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చినా పట్టించుకోలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అత్యాచారాలప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తితే.. కాలుష్యానికి వ్యతిరేకంగా గొంతెత్తితే.. 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసులు పెడుతున్నారని, బాబు పాలనలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఇంకా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. 
 
సువర్ణాంధ్ర  కథ దేవుడెరుగు..!
‘చంద్రబాబు తన పాలనలో రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్‌ చేస్తామంటే నమ్మి.. వయస్సులో పెద్దాయన అని ఆయనకు పట్టంకట్టారు. కానీ సువర్ణ ఆంధ్రప్రదేశ్‌ కథ దేవుడు ఎరుగు.. ఏపీ కరువుప్రదేశ్‌గా మారిపోయింది’ అని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. బాబు సీఎం అయ్యాక వరుసగా మూడో సంవత్సరం కరువు, లేదా అకాల వర్షాలు సంభవిస్తున్నాయని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఆత్మహత్యలప్రదేశ్‌గా మారిందని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 
 
సువర్ణాంధ్రప్రదేశ్ కథ దేవుడు ఎరుగు.. ఆంధ్రప్రదేశ్‌ ఆత్మహత్యలప్రదేశ్‌గా మారింది. రాష్ట్రంలో 93శాతం రైతులు ఇవాళ అప్పుల ఊబిలో ఉన్నారని, రైతుల అప్పుల విషయంలో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని సెస్‌ నివేదిక ఇచ్చింది. రైతులకు రుణాలుమాఫీ కావడంతో బ్యాంకులు వారి నుంచి అపరాధ వడ్డీని వసూలు చేస్తున్నాయి. దీంతో రైతులు బ్యాంకులకు వెళ్లేలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 
 
సువర్ణాంధ్రప్రదేశ్ కథ దేవుడు ఎరుగు.. రాష్ట్రం అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మారింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఆంధ్రరాష్ట్రం అవినీతిలో నంబర్‌ వన్‌గా ఉందని NCAER సర్వే చేసి మరీ తెలిపింది. 
 
సువర్ణాంధ్రప్రదేశ్ కథ దేవుడు ఎరుగు.. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. మంచినీటి కథ దెవుడెరుగు మద్యం మాత్రం ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా దొరుకుతోంది
 
సీఎం డెయిరీ మాత్రం వెలిగిపోతోంది
బాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో వృద్ధిరేటు మద్యం విషయంలోనే కనిపిస్తోంది. చంద్రబాబు సీఎం అయ్యాక ఆయన సొంత ఆస్తులు పెరుగుతున్నాయి. బాబు సీఎం అయినప్పుడు హెరిటేజ్‌ షేర్‌ ధర రూ. 200 ఉంటే అది ఇప్పుడు రూ. 900కు పెరిగింది. ఏకంగా 450శాతం పెరిగింది. అన్నీ డెయిరీలు మూతపడ్డా.. సీఎం డెయిరీ మాత్రం వెలిగిపోతోంది. నల్లధనం.. తెల్లధనంగా మార్చుకోవడం చంద్రబాబు దగ్గరే నేర్చుకోవాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement