జైలు నుంచి ఉస్మానియాకు జగన్ తరలింపు | Sakshi
Sakshi News home page

జైలు నుంచి ఉస్మానియాకు జగన్ తరలింపు

Published Thu, Aug 29 2013 10:57 PM

YS Jaganmohan reddy shifted to hospital

హైదరాబాద్: గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డిని గురువారం రాత్రి 11.50 గంటలకు చంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.చంచల్గూడ జైలు వెనక గేటు వద్ద ముందుగా రక్షక్ వాహనాలను అరగంట ముందు నుంచి సిద్ధంగా ఉంచారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సిద్ధం చేశారు. రాత్రి 10.30 గంటల సమయంలో చంచల్గూడ జైల్లోకి ఎస్కార్టు వాహనం వెళ్లింది. అప్పటికే చంచల్గూడ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసు, కేంద్ర బలగాలు చేరుకున్నాయి. 11 గంటల సమయంలో పైలట్ వాహనాల సైరన్లు బయటకు వినిపించాయి. కొద్దిసేపు హడావుడి జరిగినా, తర్వాత మళ్లీ అరగంట పాటు పరిస్థితి మామూలుగానే ఉంది. అయితే చంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రి వరకు వెళ్లే మార్గం మొత్తాన్ని ముందుగానే పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

11.30 గంటల ప్రాంతంలో పోలీసుల హడావుడి మరింతగాపెరిగింది. రక్షక్ వాహనాలు సైరన్లతో సిద్ధంగా నిలిచాయి. ఆ మార్గంలో ట్రాఫిక్ మొత్తాన్ని పోలీసులు నియంత్రించారు. సాధారణ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్ బలగాలను సైతం జైలు పరిసరాల్లోను, ఉస్మానియా ఆస్పత్రి పరిసరాల్లోను మోహరించారు. సరిగ్గా 11.50 గంటలకు పోలీసులు భారీ సంఖ్యలో వచ్చారు. పైలట్ వాహనాలు బయటకు వచ్చాయి.

రాత్రి ట్రాఫిక్ తగ్గిన తర్వాత అయితేనే ఆయన భద్రతకు పూర్తి భరోసా ఉంటుందని, దానికితోడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల నుంచి కూడా ప్రతిఘటన మరీ ఎక్కువగా ఎదురుకాకుండా ఉంటుందని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానులు 'జై జగన్' నినాదాలతో ఆ ప్రాంతం మొత్తాన్ని హోరెత్తించారు.

ముందుగానే వైఎస్ జగన్మోహనరెడ్డిని చికిత్సకు సహకరించాల్సిందిగా అధికారులు సూచించారు. కానీ 125 గంటలుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జగన్ మాత్రం అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. ఆయన అంగీకరించినా, అంగీకరించకపోయినా జైలు అధికారులు మాత్రం ఇక్కడి నుంచి ఆస్పత్రికి తరలించాలనే నిర్ణయించారు. అయితే, ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్న తర్వాత, అక్కడ వైద్యులకు ఆయన సహకరిస్తారా, లేదా అన్న విషయాన్ని బట్టే దీక్ష భగ్నం విషయం తెలుస్తుంది. ముందుగా బ్యారక్ నుంచి డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ వద్దకు తీసుకెళ్లారు.

Advertisement
Advertisement