29 నుంచి రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర | Sakshi
Sakshi News home page

29 నుంచి రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర

Published Sun, Jun 21 2015 3:41 AM

29 నుంచి రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర - Sakshi

* నాలుగు రోజులపాటు ఏడు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటన
* 15 కుటుంబాలకు పలకరింపు
* షెడ్యూల్ విడుదల చేసిన వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి జూలై 2 వరకు 4 రోజుల పాటు రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్రను నిర్వహించనున్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో 15 కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.

వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా కలుసుకుని పరామర్శిస్తానని వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున సోదరి షర్మిల పరామర్శ యాత్రను చేపడుతున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇదివరకే వైఎస్ జగన్ ఓదార్పు పూర్తికాగా, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో షర్మిల పరామర్శ యాత్రను పూర్తిచేశారని, తాజాగా రంగారెడ్డి జిల్లాలో యాత్ర చేపడతారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కె.శివకుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డితో కలసి రంగారెడ్డి జిల్లా పరామర్శ యాత్ర షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు.
 
ఇదీ షెడ్యూల్...
29న ఉదయం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తమ నివాసం నుంచి షర్మిల బయలుదేరి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెలగూడ గ్రామంలో అంజయ్య కుటుంబాన్ని తొలుత పరామర్శిస్తారు. అక్కడి నుంచి మంకాళ్ గ్రామంలో ఎంగల జోసెఫ్ కుటుంబాన్ని కలుసుకుంటారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దండుమైలారం గ్రామంలో పోకల్‌కార్ మేహ ష్‌జీ కుటుంబాన్ని పరామర్శిస్తారు. 30న మేడ్చల్ నియోజకవర్గంలోని కండ్లకోయ గ్రామంలో సుముద్రాల సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని, ఆ తర్వాత మేడ్చల్ గ్రామంలో కొల్తూరి ముత్యాలు కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు.

అక్కడి నుంచి ఇదే నియోజకవర్గంలోని కేసారం గ్రామంలో చెన్నూరి వెంకటేష్ కుటుంబాన్ని, మూడుచింతలపల్లి గ్రామంలోని జామా కృష్ణయ్య కుటుంబాన్ని, లక్ష్మాపూర్‌లో నూతనకంటి మహేశ్ కుటుంబాన్ని ఆమె కలుసుకుంటారు. జూలై ఒకటిన చేవెళ్ల నియోజకవర్గం ఎన్కెపల్లికి చెందిన ఈడిగ సుగుణ కుటుంబాన్ని, పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్‌కు చెందిన కల్ప కృష్ణారెడ్డి కుటుం బాన్ని,  పరిగిలోని బంగరిగళ్ల శ్రీనివాస్ కుటుం బాన్ని, తాండూరు నియోజకవర్గంలోని  గొట్టిగఖుర్దుకి చెందిన ఆవునల లక్ష్మణయ్య చారి కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. 2న వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లిలో కమ్మరి నారాయణ కుటుంబాన్ని, మోమిన్‌పేట్‌లో అరిగె యాదయ్య కుటుంబా న్ని, ఎన్కెతలలో ఆలంపల్లి వెంకటేశ్ కుటుం బాన్ని కలుసుకుని పరామర్శ యాత్రను ముగిస్తారు.
 
ఏర్పాట్లపై రేపు సమీక్ష
షర్మిల రంగారెడ్డి జిల్లా పరామర్శ యాత్ర ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించేందుకు పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశం సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది.

Advertisement
Advertisement