విజయవాడలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

విజయవాడలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్

Published Wed, Oct 14 2015 4:18 PM

విజయవాడలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్ - Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేయడానికి నిరసనగా విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మార్చ్ను పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రాండ్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు మార్చ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది.

పీడబ్ల్యూడీ గ్రాండ్ వద్ద పోలీసులు మార్చ్ను అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్ సీపీ నేతలకు, పోలీసులకు మధ్య  వాగ్వాదం జరిగింది. పోలీసులు వైఎస్ఆర్ సీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తీరును వైఎస్ఆర్ సీపీ నేతలు ఖండించారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం ఆగదని సీనియర్ నేత బొత్స సత్యానారాయణ చెప్పారు. మరో నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేతలను, ప్రజాప్రతినిధులను ఏ మాత్రం గౌరవించకుండా పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యాన్లో ఎక్కించారని ఉమ్మారెడ్డి అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వైఎస్ఆర్ సీపీ నేతలను ఇబ్రహీంపట్నం, భవానీపురం, కృష్ణలంక, మాచవరం, పడమట పోలీస్ స్టేషన్లకు తరలించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప్టిన మార్చ్లో సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ జగన్ గుంటూరు నల్లపాడు రోడ్డులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను.. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement