Sakshi News home page

'వైఎస్ఆర్ ఫొటో ఏర్పాటుకు హామీ'

Published Fri, Jul 31 2015 1:22 PM

'వైఎస్ఆర్ ఫొటో ఏర్పాటుకు హామీ' - Sakshi

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ లాంజీలో తొలగించిన వైఎస్ఆర్ ఫొటోను యథాస్థానంలో ఏర్పాటు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. శుక్రవారం అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. తొలగించిన వైఎస్ఆర్ ఫొటో చూపాలంటూ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణను ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నిలదీశారు.

స్పీకర్ అనుమతితోనే ఫొటోను తొలగించామని కార్యదర్శి పేర్కొన్నారు. తొలగించిన ఫొటోను వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయన చూపించారు. అసెంబ్లీ సమావేశాల లోపు ఫొటోను ఏర్పాటుచేయకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయన్నారు. దాంతో స్పందించిన కార్యదర్శి స్పీకర్ రాగానే చర్చించి వైఎస్ఆర్ ఫొటోను వెంటనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యదర్శి హామీతో వైసీపీ ఎమ్మెల్యేలు ధర్నాను విరమించారు.

కాగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ను కలవడానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణతో వారు మాట్లాడారు. స్పీకర్ కు వినతిపత్రం ఇవ్వాలని కోరుతు కార్యదర్శి చేతికి అందజేశారు. అసెంబ్లీ లాంజీలో తొలగించిన దివంగత నేత వైఎస్సార్ చిత్ర పటాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరుతున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement