ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా? | Sakshi
Sakshi News home page

ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా?

Published Fri, Jan 1 2016 2:49 AM

ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా? - Sakshi

* ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ
* పెండింగ్‌లో 28.52 వేల జన్మభూమి ఫిర్యాదులు
* వాటిని పరిష్కరించకుండా మూడో విడత డ్రామా ఎందుకు?
* ఎన్నికల్లో ఇచ్చిన 15 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?
* జన్మభూమి కార్యక్రమంలో నిలదీయాలని ప్రజలకు బహిరంగ లేఖ


సాక్షి, హైదరాబాద్: ఎన్నికలముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడవ విడత జన్మభూమి అంటూ డ్రామాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.

గతంలో ఇచ్చిన 15 వాగ్దానాల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించింది. జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మూడో విడత జన్మభూమిలో దీనిపై సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం బహిరంగ లేఖ విడుదల చేసింది. రెండు విడతల జన్మభూమి కార్యక్రమంలో 13 జిల్లాల్లో ప్రజల నుంచి 33 లక్షలా 27 వేల 506 ఫిర్యాదులు అందగా వీటిలో 28 లక్షలా 52 వేలా 938 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయ సమాచారం ఇచ్చే కోర్ డాష్‌బోర్డు గురువారం స్పష్టం చేసిందని పేర్కొంది.

ఇలా 28.52 లక్షలకు పైగా ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నా మూడో విడత జన్మభూమి అంటూ డ్రామా ఆడటానికి వచ్చే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రూ. 86,712 కోట్ల వ్యవసాయ రుణాలు ఉండగా... బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించని కారణంగా 20 నెలల్లో దానిమీద వడ్డీ 14 శాతం చొప్పున రూ. 20 వేల కోట్లు చేరిందని తెలిపింది. అయితే ఈ రెండేళ్లకు కలిపి ఇచ్చింది కేవలం రూ.7,300 కోట్లే. అంటే వడ్డీలో మూడో వంతు కూడా ఇవ్వలేద ని లేఖలో పేర్కొంది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన 15 వాగ్దానాలూ ఎందుకు అమలు చేయలేదని జన్మభూమి కార్యక్రమంలో నిలదీయాలని వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది.
 
బాబూ... ఒక్క వాగ్దానాన్నైనా అమలు చేశారా?
* రైతన్నల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? కనీసం వడ్డీ అయినా మాఫీ అయిందా?
* ఆడపడుచుల డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా?
* ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం, అది ఇచ్చేవరకు ప్రతి ఇంటికీ నెలకు రూ. 2 వేల వరకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?
* కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారా? హోం గార్డులు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యా వాలంటీర్ల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నారా?
* బెల్టు షాపులు రద్దు అయ్యాయా? మద్యం దుకాణాలు పెరగలేదా?
* పేదలందరికీ మూడు సెంట్ల భూమిలో రూ.లక్షన్నరతో పక్కా ఇల్లు ఒక్కరికైనా ఇచ్చారా?
* గ్యాస్ సిలిండర్‌పై రూ. 100 సబ్సిడీ ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పారు... ఇస్తున్నారా?
* ఇంటింటికీ రూ. 2లకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తాం అన్నారు... ఇచ్చారా?
* బీసీలకు ప్రత్యేక బడ్జెట్, ఏటా రూ. 10 వేల కోట్లు పెడతాం అన్నారు... ఇచ్చారా?
* కాపుల కోసం బడ్జెట్‌లో ఏటా వెయ్యి కోట్లు అన్నారు. ఈ రెండేళ్లకూ రూ. 2 వేల కోట్లు ఇచ్చారా? బీసీలకు దెబ్బతగలకుండా కాపులను బీసీలుగా చేస్తానన్నారు. చేశారా?
* పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలోగా పూర్తి చేస్తామన్నారు. మీ ఏడాదిన్నర పాలనలో కొంతైనా ముందుకు కదిలిందా?
* నేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? రూ. 1.5 లక్షలతో ఉచితంగా ఇల్లు, మగ్గం షెడ్డు నిర్మించి ఇచ్చారా? తాను ముఖ్యమంత్రి అయ్యేవరకు ఉన్న చేనేత రుణాలన్నీ రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు...అమలయ్యాయా?
* భూమి లేని పేదవారికి రెండు ఎకరాల భూమి ఇస్తానన్నారు... ఇచ్చారా?
* లారీ, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు వాహనాల కొనుగోలుకు వడ్డీలేని రుణాలు ఇస్తానన్నారు. ఇచ్చారా? అవినీతి లేని పరిపాలన అందిస్తామన్నారు. అందిస్తున్నారా?

Advertisement

తప్పక చదవండి

Advertisement