నాట్కో ఫార్మా లాభం 28% అప్ | Sakshi
Sakshi News home page

నాట్కో ఫార్మా లాభం 28% అప్

Published Fri, Nov 15 2013 3:33 AM

Natco Pharma Q2 net up 28% at Rs 27cr

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాట్కో ఫార్మా నికర లాభం 28 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 27 కోట్లుగా నమోదైంది. అయితే, అమ్మకాలు మాత్రం రూ. 162.91 కోట్లకు తగ్గాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో అమ్మకాలు రూ. 169.16 కోట్లు కాగా లాభం రూ. 20.99 కోట్లు. వేల్యూ యాడెడ్ ఫార్ములేషన్ల ఎగుమతులు మెరుగైన పనితీరుకు దోహదపడ్డాయని కంపెనీ తెలిపింది.
 
 కొపాక్జోన్ వివాదంలో ఊరట..
మల్టిపుల్ స్లెరోసిస్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే కొపాక్జోన్ జనరిక్ వెర్షన్‌కి సంబంధించి టెవా ఫార్మాతో వివాదంలో అమెరికా కోర్టులో నాట్కోకి ఊరట లభించింది. ఈ ఔషధ జనరిక్ తయారీపైనా, తన పేటెంట్ హక్కుల గడువు ఏడాది ముందే ముగిసిపోతుందన్న అప్పీళ్ల కోర్టు ఉత్తర్వులపైనా స్టే విధించాలంటూ టెవా ఫార్మా వేసిన పిటీషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇక అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతులు కూడా లభిస్తే వచ్చే ఏడాదిలో కొపాక్జోన్ జనరిక్‌ని ప్రవేశపెట్టేందుకు నాట్కోకి మార్గం సుగమం అవుతుంది. ప్రస్తతం టెవా లాభాల్లో దాదాపు 50 శాతం కొపాక్జోన్‌దే ఉంటుంది. దీనిపై టెవా పేటెంట్ హక్కుల గడువు 2015 కాకుండా 2014లో ముగిసిపోతుందని అప్పీల్స్ కోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై టెవా సుప్రీం కోర్టుకు వెళ్లగా తాజా ఆదేశాలు వచ్చాయి.

Advertisement
Advertisement